Site icon HashtagU Telugu

West Indies Series: విండీస్ తో వన్డేలకు కెప్టెన్ గా ధావన్

India Squad

India Squad

వెస్టిండీస్ తో సిరీస్ కు భారత జట్టును ప్రకటించారు. ఊహించినట్టుగానే పలువురు సీనియర్లకు విశ్రాంతినిచ్చారు. బిజీ షెడ్యూల్ కారణంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బూమ్రా, రిషబ్ పంత్ లను ఎంపిక చేయలేదు. ఈ సిరీస్ కు ఎవ్వరూ ఊహించని విధంగా గా శిఖర్ ధావన్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఐర్లాండ్ తో టీ ట్వంటీల్లో సత్తా చాటిన దీపక్ హుడా వన్డేలకు ఎంపికయ్యాడు. సంజూ శాంసన్ తో పాటు యువపేసర్ అర్షదీప్ సింగ్ కూడా చోటు దక్కించుకున్నాడు. విండీస్ పర్యటనకు పూర్తి యువ ఆటగాళ్ళతో కూడిన జట్టును ఎంపిక చేశారు.

టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు పలువురు సీనియర్లను వన్డే సిరీస్ లకు దూరం పెడుతున్నారు. ఇదే టూర్ లో భారత జట్టు ఐదు టీ ట్వంటీలు కూడా ఆడనుంది. ఈ సిరీస్ కోసం జట్టును తర్వాత ప్రకటించనున్నట్టు బీసీసీఐ వెల్లడించింది. అయితే శిఖర్ ధావన్ కు కెప్టెన్సీ ఇవ్వడం ఆశ్చర్యమే. గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరమైన ధావన్ రీఎంట్రీలో సారథ్య బాధ్యతలు అందుకోనున్నాడు. అలాగే సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్ లను కూడా వన్డే జట్టులో పలు స్థానాల కోసం పరిశీలిస్తున్నారు. తమ సత్తా నిరూపించుకునేందుకు ఈ సిరీస్ వారికి మంచి అవకాశంగా చెప్పొచ్చు. ముఖ్యంగా అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్న సంజూ శాంసన్ విండీస్ టూర్ రాణిస్తే జాతీయ జట్టులో చోటు నిలుపుకునే అవకాశం ఉంటుంది. కాగా ఈ పర్యటనలో భారత్ జట్టు జూలై 22 , 24 , 27 తేదీల్లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వన్డేలు ఆడనుంది. అనంతరం ఐదు టీ ట్వంటీల సిరీస్ జూలై 29 నుంచి మొదలు కానుంది.

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు:
శిఖర్‌ ధావన్‌(కెప్టెన్‌), రవీంద్ర జడేజా(వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, శుబ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), సంజూ శాంసన్‌(వికెట్‌ కీపర్‌), శార్దూల్‌ ఠాకూర్‌, యజువేంద్ర చహల్‌, అక్షర్‌ పటేల్‌, ఆవేశ్‌ ఖాన్‌, ప్రసిద్‌ కృష్ణ, మహ్మద్‌ సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.