Site icon HashtagU Telugu

T20I Captain : సూర్యకుమార్ కే టీ20 కెప్టెన్సీ..శ్రీలంక టూర్ కు భారత జట్టు ఇదే

Sri Lanka Series Suryakumar

Sri Lanka Series Suryakumar

ఊహించిందే జరిగింది…టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ (T20I Captain) గా సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ను సెలక్టర్లు ఎంపిక చేశారు. రోహిత్ శర్మ (Rohit Sharma) రిటైర్మెంట్ తో హార్థిక్ పాండ్యాకే పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. అయితే గంభీర్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. ఫిట్ నెస్ సమస్యలు, తరచూ గాయాల బారిన పడే హార్థిక్ కెప్టెన్ గా వద్దంటూ గంభీర్ సెలక్టర్లకు చెప్పినట్టు తెలుస్తోంది. సారథిగా పాండ్యా ఉంటే అన్ని మ్యాచ్ లూ ఖచ్చితంగా ఆడాల్సిన పరిస్థితి ఉంటుందన్న కారణంతోనే అతన్ని తప్పించినట్టు తెలుస్తోంది. సూర్యకుమార్ యాదవ్ కు టీ ట్వంటీ కెప్టెన్సీ ఇవ్వాలని గంభీర్ కోరడం, సెలక్టర్లు చర్చించి చివరికి అతని సిఫార్సుకే మొగ్గుచూపడం జరిగాయి. అయితే హార్థిక్ ను పక్కన పెట్టే విషయంలో సెలక్షన్ కమిటీ రెండుగా విడిపోయినట్టు కూడా ప్రచారం జరిగింది. దీంతో ప్రస్తుత సిరీస్ కు మాత్రమే సూర్యకుమార్ కు కెప్టెన్సీ ఇచ్చి… రానున్న రోజుల్లో ఫలితాల ప్రకారం కొనసాగించాలన్న నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటే పాండ్యా టీ ట్వంటీ సిరీస్ ఆడనుండగా… వైస్ కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ను ఎంపిక చేశారు. అటు వన్డే జట్టును రోహిత్ శర్మ లీడ్ చేయనుండగా… గంభీర్ సూచన మేరకు కోహ్లీ కూడా ఈ సిరీస్ ఆడనున్నాడు. ఇక గాయాల నుంచి కోలుకున్న శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ వన్డే జట్టులోకి తిరిగి వచ్చారు. ఊహించినట్టుగానే ఇషాన్ కిషన్ ను సెలక్టర్లు మరోసారి పక్కనపెట్టారు. దీంతో ఇషాన్ దేశవాళీ క్రికెట్ ఆడితే తప్ప మళ్లీ పరిగణలోకి తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. మరోవైపు హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ రెండు జట్లలోనూ చోటు దక్కించుకున్నాడు. అయితే జింబాబ్వే టూర్ లో సెంచరీతో మెరిసిన అభిషేక్ శర్మకు నిరాశే మిగిలింది. ఇక వికెట్ కీపర్ సంజూ శాంసన్ టీ ట్వంటీ జట్టులోకి మాత్రమే ఎంపికయ్యాడు. వన్డే జట్టులో కీపర్ గా రిషబ్ పంత్ తో పాటు కేఎల్ రాహుల్ ఉండడంతో సంజూకి చోటు దక్కలేదు. ఇక ఆల్ రౌండర్ శివమ్ దూబే రెండు జట్లలోకి ఎంపికయ్యాడు. వరల్డ్ కప్ ఆడిన జట్టు బూమ్రాకు మాత్రమే రెస్ట్ ఇచ్చిన సెలక్టర్లు పేసర్లుగా అర్షదీప్ సింగ్, సిరాజ్ , ఖలీల్ అహ్మద్ , హర్షిత్ రాణాలను ఎంపిక చేశారు. కాగా శ్రీలంక పర్యటనలో భారత్ మూడు టీ ట్వంటీలు, మూడు వన్డేలు ఆడనుంది.

Read Also : KL Rahul New House: కేఎల్ రాహుల్ టేస్ట్ అదిరిందిగా.. 20 కోట్లతో ఇంద్రభవనం