Asia Cup 2023: వన్డే ప్రపంచకప్ కు ముందు భారత్ సత్తాకు పరీక్షగా మారిన ఆసియాకప్ టోర్నీకి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెలాఖరు నుండి పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆసియాకప్ జరగనుంది. ఈ టోర్నీకి భారత జట్టును ఆదివారం ప్రకటించనున్నారు. దీని కోసం అజిత్ అగర్కార్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ ముంబైలో సమావేశం కానుంది. ఆసియాకప్ జట్టులో ఉన్న ఆటగాళ్ళే దాదాపుగా ప్రపంచకప్ ఆడే అవకాశముందని పలువురు భావిస్తున్నారు. అయితే గాయాలతో ఆటకు దూరమైన శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. వీరిద్దరి ఫిట్ నెస్ పై పలు వార్తలు వస్తున్నా ఆసియాకప్ కు ఎంపికవుతారని అంచనా వేస్తున్నారు. వీరిద్దరి పునరాగమనంపై మాత్రం బోర్డు వర్గాల నుండి పూర్తి క్లారిటీ లేదు. కెఎల్ రాహుల్ ఫిట్ నెస్ సాధించినా.. అయ్యర్ ఇంకా కోలుకునేందుకు సమయం పడుతుందని బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై బీసీసీఐ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
ఐర్లాండ్ తో సిరీస్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న బుమ్రా ఆసియాకప్ లో ఆడడం ఖాయమే. ఇదిలా ఉంటే భారత్ కు చాలా కాలంగా సమస్యగా మారిన నెంబర్ 4 లో ఎవరిని కొనసాగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. సూర్యకుమార్ యాదవ్ ను ఆడిస్తారని అనుకుంటున్నా.. టీ ట్వంటీల్లో రాణిస్తున్న స్కై వన్డేల్లో మాత్రం నిరాశపరుస్తున్నాడు. అయితే ఈ స్థానానికి పలువురు యువక్రికెటర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఐపీఎల్ లో అదరగొట్టి విండీస్ తో టీ ట్వంటీ సిరీస్ కు ఎంపికై అందరినీ ఆకట్టుకున్న హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. విండీస్ తో సిరీస్ లో అరంగేట్రం చేసిన తిలక్ 57 సగటుతో 173 పరుగులు చేశాడు. ప్రపంచకప్ జట్టులో కూడా తిలక్ కు అనూహ్యంగా చోటు దక్కినా ఆశ్చర్యపోనవసరం లేదని మాజీలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆసియాకప్ కు పాక్ ఆతిథ్యమిస్తుండగా.. అక్కడకు వెళ్ళేందుకు భారత్ నిరాకరించడంతో రెండో ఆతిథ్య దేశంగా శ్రీలంకను ఎంపిక చేశారు. భారత్ ఆడే మ్యాచ్ లన్నింటికీ లంకనే ఆతిథ్యం ఇవ్వనుంది. సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థి పాక్ తో జరిగే మ్యాచ్ తో టీమిండియా ఆసియాకప్ వేట మొదలు కానుంది.
Also Read: Hormonal Breakouts: పీరియడ్స్ సమయంలో వచ్చే మొటిమలకు చెక్ పెట్టిండిలా?