Site icon HashtagU Telugu

Indian Team: కామన్‌వెల్త్‌గేమ్స్‌కు భారత బృందం ప్రకటన

Indian Commonwealth

Indian Commonwealth

బర్మింగ్‌హామ్ వేదికగా జరగనున్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత బృందం ఖరారైంది. క్రికెట్ మినహాయిస్తే 124 మందితో కూడిన జట్టును భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది. భారత్ రెజ్లింగ్ , బ్యాడ్మింటన్ , హాకీ, అథ్లెటిక్స్ , టేబుల్ టెన్నిస్‌తో సహా 84 ఈవెంట్లలో పాల్గొనబోతోంది. క్రికెట్‌లో పాల్గొనే పురుషుల , మహిళల జట్లను బీసీసీఐ ఎంపిక చేయాల్సి ఉంది. కాగా మెడల్స్ సాధించే ఎక్కువ అవకాశాలున్న ఈవెంట్లలో ముందు బ్యాడ్మింటన్‌ను చెప్పుకోవాలి. దీనికి సంబంధించి పురుషుల విభాగంలో లక్ష్యసేన్ , కిదాంబి శ్రీకాంత్ , చిరాగ్ షెట్టి-సాత్విక్ సాయిరాజ్‌, సుమీత్‌రెడ్డి ఎంపికయ్యారు.

మహిళల విభాగంలో తెలుగుతేజం పివి సింధుతో పాటు అశ్విని పొన్నప్ప, ఆకర్షి కష్యప్, ట్రీసా జాలీ, గోపీచంద్ కుమార్తె గాయత్రి గోపీచంద్ చోటు దక్కించుకున్నారు. బ్యాడ్యింటన్ తర్వాత బాక్సింగ్‌లో మెడల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాక్సింగ్‌ మహిళల విభాగంలో హైదరాబాదీ బాక్సర్ నిఖత్ జరీన్‌తో పాటు నీతూ, జైస్మిన్, లవ్‌లీనా ఎంపికవగా… పురుషుల విభాగంలో శివథాపా, మహ్మద్ హుస్సాముద్దీన్, అమిత్ పంగల్, రోహిత్ టొకాస్, సుమిత్ కుందు, ఆశిష్ చౌదరి, సంజీత్‌ కుమార్, సాగర్ చోటు దక్కించుకున్నారు. ఇక రెజ్లింగ్‌లో అంచనాలున్న పలువురు క్రీడాకారులు ఎంపికయ్యారు. మహిళల విభాగంలో స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగట్, సాక్షి మాలిక్‌తో పాటు పూజా గెహ్లాట్, అన్షు మాలిక్, దివ్య కాక్రన్, పూజా సిహాగ్ చోటు దక్కించుకోగా,…పురుషుల విభాగంలో రవికుమార్ దాహియా, భజరంగ్ పూనియా, దీపక్ పూనియా, దీపక్, మొహిత్ గ్రెవాల్, నవీన్ ఎంపికయ్యారు. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చానుతో పాటు నిలకడగా రాణిస్తున్న పలువురు క్రీడాకారులు చోటు దక్కించుకున్నారు.

అయితే క్రికెట్‌కు సంబంధించి మహిళల, పురుషుల విభాగాల్లో భారత్ బరిలోకి దిగుతోంది. 15 మందితో కూడిన జట్లను బీసీసీఐ త్వరలోనే ప్రకటించనుంది. ఒలింపిక్స్‌లో సత్తా చాటిన పలువురు క్రీడాకారులు కామన్‌వెల్త్‌గేమ్స్‌కు ఎంపికైన నేపథ్యంలో గతంతో పోలిస్తే ఈ సారి పతకాల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.