Site icon HashtagU Telugu

T20 Series Draw: చివరి టీ ట్వంటీకి వరుణుడి దెబ్బ.. సిరీస్ సమం

Rain Cricket

Rain Cricket

ఎంతో ఆసక్తిని రేకెత్తించిన భారత్, సౌతాఫ్రికా టీ ట్వంటీ సిరీస్ కు నిరాశజనకమైన ముగింపు…ఊహించినట్టుగానే బెంగళూరు మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడ్డాడు. దీంతో ఫలితం తేలకుండానే మ్యాచ్ రద్దయింది.

టాస్ సరైన సమయానికే పడడంతో మ్యాచ్ సజావుగా సాగుతుందని అభిమానులు సంబరపడ్డారు. ఆదివారం కావడం, సిరీస్ డిసైడర్ కావడంతో అభిమానులు స్టేడియానికి పోటెత్తారు. మరోసారి పంత్ ను నిరాశకు గురి చేస్తూ టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే టాస్ పడిన కాసేపటికే వర్షం మొదలైంది.

చాలా సేపటి తర్వాత తగ్గుముఖం పట్టగా.. ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో సమయం వృథా అయింది. చివరికి 19 ఓవర్లకు మ్యాచ్ ను కుదించడంతో భారత్ బ్యాటింగ్ ఆరంభమైంది. తొలి ఓవర్లోనే ఇషాన్ కిషన్ 15 పరుగులు చేయడంతో మంచి ఆరంభం లాగే కనిపించింది. అయితే ఏడు పరుగుల తేడాలో ఓపెనర్లు ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ ఔటవడంతో భారత్ 27 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించింది. క్రమంగా భారీ వర్షంగా మారడంతో మ్యాచ్ జరిగేలా కనిపించలేదు.

కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ నైనా చూద్దామనుకున్న ఫ్యాన్స్ స్టేడియంలోనే ఆశతో ఎదురుచూశారు. అయితే వరుణుడు శాంతించకపోవడంతో చివరికి మ్యాచ్ ను రద్దు చేయక తప్పలేదు. దీంతో ఐదు టీ ట్వంటీల సిరీస్ 2-2తో సమంగా ముగిసింది. ఈ సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లలో సౌతాఫ్రికా గెలిస్తే.. తర్వాత అద్భుతంగా పుంజుకున్న టీమిండియా వరుస విజయాలతో సమం చేసింది. భువనేశ్వర్ కుమార్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ దక్కింది.

 

Exit mobile version