1000th One Day : భారత్ @ 1000 వన్డే

భారత్ , వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ కు ఫిబ్రవి 6న తెరలేవనుంది.

  • Written By:
  • Updated On - February 4, 2022 / 12:47 PM IST

భారత్ , వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ కు ఫిబ్రవి 6న తెరలేవనుంది. మూడు వన్డేలతో పాటు 3 టీ ట్వంటీలు ఆడేందుకు విండీస్ జట్టు ఇప్పటికే భారత్ కు చేరుకోగా… అటు భారత ఆటగాళ్ళు కూడా క్వారంటైన్ లో ఉన్నారు. క్వారంటైన్ పూర్తి చేసుకున్న వెంటనే ప్రాక్టీస్ లో ఇరు జట్లూ బిజీగా కానున్నాయి. ఇదిలా ఉంటే ఈ సిరీస్ లో భారత జట్టు అరుదైన మైలురాయి అందుకోబోతోంది. విండీస్ తో జరిగే తొలి వన్డేతో టీమిండియా ఓ అసాధారణ రికార్డును ఖాతాలో వేసుకోనుంది. అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో 1000వ వన్డే మైలురాయిని టీమిండియా ఈ మ్యాచ్‌తో సాదించనుంది. ఇప్పటివరకు 999 వన్డేలు ఆడిన టీమిండియా.. ఈ మ్యాచ్‌ ద్వారా అరుదైన మైలురాయిని చేరుకోనుంది.. మరోవైపు తొలి వన్డేలో టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించడం ద్వారా రోహిత్‌ శర్మ కూడా అరుదైన ఘనత సాదించనున్నాడు..భారత్ క్రికెట్‌ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్‌కు సారథిగా వ్యవహరించనున్నాడు… 1974లో హెడింగ్లే వేదికగా ప్రారంభమైన టీమిండియా తొలి వన్డేకు అజిత్‌ వాడేకర్‌ సారథిగా వ్యవహరించగా.. 300వ వన్డేకు సచిన్‌ టెండూల్కర్, 500వ వన్డేకు సౌరవ్ గంగూలీ, 700, 800, 900వ వన్డేలకు ఎంఎస్ ధోని కెప్టెన్లుగా వ్యవహరించారు…. తాజాగా 1000వ వన్డేకు రోహిత్ నాయకుడిగా ఉండనున్నాడు. కాగా ప్రపంచ క్రికెట్ లో అత్యధిక వన్డేలు ఆడిన జట్ల జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉండగా… ఆస్ట్రేలియా 958 మ్యాచ్ లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.