ఇంగ్లాండ్ గడ్డపై చారిత్రక సీరీస్ విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్ జట్టుకు అది అంత సులభం కాదని తెలుస్తోంది. సొంత గడ్డపై ఇంగ్లాండ్ ఫామ్…మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తున్న ఎడ్జ్ బాస్టన్ లో గత రికార్డులు భారత్ ను టెన్షన్ పెడుతున్నాయి. తాజాగా ఈ టెస్ట్ కోసం రెడీ చేస్తున్న పిచ్ కూడా భారత్ కు సవాల్ విసరనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సీరీస్ సమం చేయాలని పట్టుదలగా ఉన్న ఇంగ్లాండ్ పేస్ పిచ్ ను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. సహజంగానే ఎడ్జ్ బాస్టన్ పిచ్ పై పరుగులు చేయడం బ్యాటర్లకు అంత సులభం కాదు. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకునేందుకు మొగ్గు చూపుతుంది. తొలి ఇన్నింగ్స్ లో ఇక్కడ 300 రన్స్ పైగా స్కోర్ చేయడం మొదటి బ్యాటింగ్ కు వచ్చే టీమ్ కు సవాలే.
ఇక్కడ పిచ్ తొలి రోజు పూర్తిగా పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ జరిగే కొద్దీ రెండో రోజు మధ్యాహ్నం నుంచీ బ్యాటింగ్ చేయడం కాస్త సులభం అవుతుంది. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ లో యావరేజ్ స్కోర్ 308 పరుగులు. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 18 సార్లు గెలిస్తే…సెకెండ్ బ్యాటింగ్ టీమ్స్ 20 సార్లు విజయం సాధించాయి. ఓవరాల్ రికార్డుల పరంగా ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు ఈ పిచ్ పై మంచి రికార్డు ఉంది. ఇక్కడ 53 మ్యాచ్ లు ఆడిన ఇంగ్లాండ్ 28 సార్లు గెలిచింది. 10 మ్యాచ్ ల్లో ఓడిపోగా..15 మ్యాచ్ లు డ్రాగా ముగిసాయి. ఈ పిచ్ పై ఇంగ్లాండ్ పేస్ ద్వయం ఆండర్సన్ , స్టువర్ట్ బ్రాడ్ కు అద్భుతమయిన రికార్డు ఉంది. వీరిద్దరూ కలిసి 21 మ్యాచ్ ల్లో 85 వికెట్లు పడగొట్టారు. అటు బ్యాటింగ్ పరంగా జో రూట్ , జానీ బెయిర్ స్టోలకు ఈ గ్రౌండ్ లో మంచి రికార్డు ఉంది.
మరోవైపు ఎడ్జ్ బాస్టన్ లో భారత్ ఒక్కసారి కూడా గెలవలేదు. ఇక్కడ ఆడిన ఆరు మ్యాచ్ ల్లోనూ టీమిండియా పరాజయం పాలైంది. దీంతో పిచ్ నుంచి, ఇంగ్లాండ్ పేస్ ద్వయం నుంచి ఎదురయ్యే సవాల్ ను తట్టుకుని భారత్ బ్యాటర్లు ఎంతవరకూ నిలబడతారనే దానిపైనే చారిత్రక సీరీస్ విజయం ఆధారపడి ఉంది.
https://twitter.com/BCCI/status/1542367143106203650