Badminton: థామస్ కప్ లో భారత్ రికార్డ్…ఫైనల్లోకి భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు..!!

బ్యాంకాక్ లో జరుగుతున్న థామస్ కప్ లో భారత్ సంచలనం క్రియేట్ చేసింది. భారత షట్లర్లు అద్భుత ప్రదర్శనను కనబరిచి పతకం ఖాయం చేసుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Thomas Cup

Thomas Cup

బ్యాంకాక్ లో జరుగుతున్న థామస్ కప్ లో భారత్ సంచలనం క్రియేట్ చేసింది. భారత షట్లర్లు అద్భుత ప్రదర్శనను కనబరిచి పతకం ఖాయం చేసుకున్నారు. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్స్ లో డెన్మార్క్ ను 3-2తో మట్టి కరిపించారు. దీంతో భారత జట్టు ఫైనల్స్ లోకి ప్రవేశించి పతకం ఖాయం చేసుకుంది. ఫలితంగా 43ఏళ్ల నిరీక్షణకు తెరదించినట్లైంది. 1979 తర్వాత భారత జట్టు ఇప్పటి వరకు సెమీస్ కు చేరలేదు. ఈసారి ఏకంగా ఫైనల్స్ లో అడుగుపెట్టింది. ఈ సారి కూడా హెచ్ ఎస్ ప్రణయ్ మ్యాచ్ కీలకంగా మారింది. రాస్మస్ గెంకేను 13-21, 21-9, 21-12తో ప్రణయ్ చిత్తు చేసాడు. అదివారం జరగనున్న స్వర్ణ పతక పోరులో డిఫెండింగ్ చాంపియన్ 14సార్లు విజేత అయిన ఇండోనేషియాతో భారత్ తలపడుతుంది.

సెమీస్ పోరును ఓటమితో ప్రారంభించిన భారత్..తొలి సింగిల్స్ లో లక్ష్యసేన్ వరల్డ్ నెంబర్ వన్ విక్టర్ అక్సెల్ సెన్ చేతిలో 13-21, 13-21తో వరుస సెట్లతో ఓటమిపాలయ్యాడు. ఆ తర్వాత జరిగిన డబుల్స్ పోరులో సాత్విక్ చిరాగ్ జోడి కిమ్ మథియస్ పై 21-18, 21-21, 22-20తో విజయం సాధించారు. దీంతో భారత్ ను తిరిగి రేసులోకి తీసుకొచ్చారు.

ఆ తర్వాత జరిగిన సింగిల్స్ మ్యాచ్ లోనూ ప్రపంచ మూడో ర్యాంకర్ ఆంటోన్ సెన్ పై ప్రపంచ చాంపియన్ షిప్స్ రజత పతక విజేత కిదాంబి శ్రీకాంత్ 21-18, 12-21, 21-15తో విజయం సాధించడంతో భారత్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అనంతరం జరిగిన మరో డబుల్స్ పోటీలోనూ కృష్ణ ప్రసాద్-విష్ణువర్ధన్ జోడీ రస్ముసెన్-సోగార్డ్ చేతిలో 14-21, 13-21తో ఓడిపోయింది. తర్వాత జరిగిన సింగిల్స్ తో ప్రణయ్ విజయం సాధించడంతో భారత్ 3-2 తో ఫైనల్స్ లోకి అడుగుపెట్టి కొత్త చరిత్రను క్రియేట్ చేసింది.

  Last Updated: 14 May 2022, 09:42 AM IST