U19WC: అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్

అండర్ 19 ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్ళింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 96 పరుగుల తేడాతో విజయం సాధించింది.

  • Written By:
  • Updated On - February 4, 2022 / 12:47 PM IST

అండర్ 19 ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్ళింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 96 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆసక్తికరంగా సాగిన పోరులో మొదట బ్యాటింగ్‌కు దిగిన యువభారత్ 290 పరుగులు చేసింది. కెప్టెన్ యశ్‌ధూల్ సెంచరీతో రాణిస్తే… వైస్ కెప్టెన్ గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ 94 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 209 పరుగుల పార్టనర్‌షిప్ సాధించారు. ఆరంభంలో నిదానంగా ఆడిన ఈ జోడీ తర్వాత ఆసీస్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం కనబరిచింది. ఇక చివరి ఓవర్లో దినేశ్ బనా 4 బంతుల్లోనే 20 రన్స్ చేయడంతో భారత్ స్కోర్ 290కి చేరింది.

అనంతరం ఛేజింగ్‌లో ఆస్ట్రేలియాను ఆరంభం నుండే భారత యువ బౌలర్లు కట్టడి చేశారు. దీంతో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన ఆసీస్ 194 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో రవికుమార్ 2 , విక్కీ ఒస్త్వాల్ 3, నిశాంత్ సింధు 2 వికెట్లు పడగొట్టారు. అండర్ 19 వరల్డ్‌కప్‌లో భారత్‌ ఫైనల్‌కు చేరడం వరుసగా ఇది నాలుగోసారి. 2016 , 2018, 2020 ఎడిషన్లలో ఫైనల్ చేరిన భారత్ ఒకసారి విజేతగానూ, రెండుసార్లు రన్నరప్‌గా నిలిచింది. గత ఎడిషన్‌లోనూ ఫైనల్ చేరినప్పటకీ అనూహ్యంగా బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. ఈ సారి అంచనాలకు తగ్గట్టే ఆరంభం నుండీ అదరగొడుతున్న భారత యువ జట్టు తుదిపోరుకు దూసుకొచ్చి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. శనివారం జరిగే టైటిల్ పోరులో యంగ్ ఇండియా , ఇంగ్లాండ్‌తో తలపడుతుంది.