India In CWG Finals: కామన్ వెల్త్ గేమ్స్ క్రికెట్ ఫైనల్లో భారత్.?

కామన్ వెల్త్ గేమ్స్ మహిళల క్రికెట్ లో భారత్ కు మెడల్ ఖాయమైంది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని ఇండియా

  • Written By:
  • Updated On - August 7, 2022 / 02:16 AM IST

కామన్ వెల్త్ గేమ్స్ మహిళల క్రికెట్ లో భారత్ కు మెడల్ ఖాయమైంది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని ఇండియా వుమెన్స్ టీమ్ ఫైనల్ కు దూసుకెళ్ళింది. ఉత్కంఠ పోరులో భారత్ 4 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ మహిళల జట్టుకు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్ స్మృతీ మంధాన దూకుడుగా ఆడింది. ఫలితంగా భారత్.. తొలి ఆరు ఓవర్లలోనే 64 పరుగులు చేసింది. దీనిలో స్మృతీ చేసినవి 50 రన్స్ ఉన్నాయంటే ఆమె ఎలా ఆడిందో అర్థం చేసుకోవచ్చు. స్మృతి కేవలం 32 బంతుల్లో 61 పరుగులు చేయగా… ఇందులో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.

తర్వాత జెమియా రోడ్రిగ్స్ 44 రన్స్ తో నిలకడగా ఆడి భారత్‌కు మెరుగైన స్కోరు అందించింది. హర్మన్ 20, దీపాలీ శర్మతో 22 రన్స్ చేశారు. దీంతో భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులు చేసింది. 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ ను భారత్ ఆదిలోనే దెబ్బ తీసింది. దూకుడుగా ఆడుతున్న అలీస్ కాప్సీ రనౌట్ చేయగా.. 27 బంతుల్లో 6 ఫోర్లతో 35 పరుగులు చేసిన డానియల్ వ్యాట్‌ని స్నేహ్ రాణా క్లీన్ బౌల్డ్ చేసింది. దీంతో ఇంగ్లాండ్ 81 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే అమీ జోన్స్, కెప్టెన్ నటలియా సివర్ కలిసి ఇంగ్లాండ్ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. చేతిలో వికెట్లు ఉండడంతో భారత్ కు ఓటమి ఖాయం అనిపించింది. అయితే భారత్ మెరుపు ఫీల్డింగ్ కు ఇంగ్లాండ్ వరుస రనౌట్ ల రూపంలో వికెట్లు చేజార్చుకుంది.

24 బంతుల్లో 3 ఫోర్లతో 31 పరుగులు చేసిన అమీ జోన్స్ రనౌటవగా…43 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 41 పరుగులు చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ సివర్ కూడా రనౌట్‌ రూపంలోనే పెవిలియన్ చేరింది. చివరి ఓవర్లో ఇంగ్లాండ్ విజయానికి 14 పరుగులు అవసరం కాగా.. పొదుపుగా బౌలింగ్ చేసిన భారత బౌలర్ స్నేహ రానా 10 పరుగులు మాత్రమే ఇచ్చింది. ఆఖరి బంతికి సిక్సర్ బాదినా 4 పరుగుల తేడాతో భారత్ గెలిచి మెడల్ ఖాయం చేసుకుంది. ఫైనల్లో గెలిస్తే స్వర్ణం… ఓడితే రజతం దక్కనుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య విజేత తో భారత్ తలపడాల్సి ఉంటుంది.