India in CWG: బ్యాడ్మింటన్, టీటీ , లాన్ బౌల్స్ ఫైనల్స్ లో భారత్

కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ వరుస మెడల్స్ కు చేరువైంది. అంచనాలకు తగ్గట్టుగా ఆడుతున్న బ్యాడ్మింటన్ ప్లేయర్స్ మిక్సెడ్ టీమ్ ఈవెంట్ లో ఫైనల్ చేరింది.

  • Written By:
  • Publish Date - August 2, 2022 / 10:51 AM IST

కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ వరుస మెడల్స్ కు చేరువైంది. అంచనాలకు తగ్గట్టుగా ఆడుతున్న బ్యాడ్మింటన్ ప్లేయర్స్ మిక్సెడ్ టీమ్ ఈవెంట్ లో ఫైనల్ చేరింది. అలాగే లాన్ బౌల్స్ లో కూడా ఫైనల్ కి చేరి తొలిసారి మెడల్ ఖాయం చేసుకుంది.
డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో వరుసగా రెండోసారి ఫైనల్లోకి అడుగు పెట్టింది. సెమీఫైనల్లో భారత్‌ 3–0తో సింగపూర్‌ను ఓడించింది. మంగళవారం జరిగే ఫైనల్లో మలేసియాతో భారత్‌ తలపడుతుంది. 2018 గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ ఫైనల్లో మలేసియాపైనే నెగ్గి భారత్‌ స్వర్ణ పతకం సాధించింది.

సింగపూర్‌తో జరిగిన సెమీఫైనల్లో తొలి మ్యాచ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి 21–11, 21–12తో యాంగ్‌ కాయ్‌–లియాంగ్‌ క్వెక్‌లపై గెలుపొందగా… రెండో మ్యాచ్‌లో పీవీ సింధు 21–11, 21–12తో జియా మిన్‌ యోను ఓడించి భారత్‌కు 2–0తో ఆధిక్యంలో నిలిపింది. మూడో మ్యాచ్‌లో లక్ష్య సేన్‌ 21–18, 21–15తో ప్రపంచ చాంపియన్‌ కీన్‌ యె లోపై నెగ్గి భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు. మరోవైపు లాన్‌ బౌల్స్‌ లో భారత మహిళల జట్టు ఫైనల్ కు చేరి చరిత్ర సృష్టించింది. ఎప్పుడూ లాన్‌ బౌల్స్‌లో ఇండియాకు మెడల్‌ రాలేదు.

అలాంటిది ఈసారి మాత్రం మన వుమెన్స్‌ టీమ్‌ కనీసం సిల్వర్‌ మెడల్‌ ఖాయం చేసింది. లవ్లీ చౌబే, పింకీ, నయన్‌మోనీ సైకియా, రూపా రాణిలతో కూడిన టీమిండియా.. సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై 16-13 తేడాతో గెలిచింది. ఫైనల్లో సౌతాఫ్రికాతో తలపడనున్న భారత్ ఓడినా కనీసం సిల్వర్‌ మెడల్‌ అయితే సాధిస్తుంది.
ఇదిలా ఉంటే పురుషుల హాకీలో ఇంగ్లండ్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌ను భారత్‌ 4–4తో ‘డ్రా’ చేసుకుంది. భారత్‌ తరఫున లలిత్‌ ఉపాధ్యాయ్‌ , హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ ఒక్కో గోల్‌ చేయగా… మన్‌దీప్‌ రెండు గోల్స్‌ సాధించాడు. ఇక పురుషుల స్క్వాష్‌ సింగిల్స్‌లో భారత స్టార్‌ సౌరవ్‌ ఘోషాల్‌ సెమీఫైనల్‌ చేరాడు. క్వార్టర్‌ ఫైనల్లో సౌరవ్‌ 11–5, 8–11, 11–7, 11–3తో స్కాట్లాండ్‌ కు చెందిన గ్రెగ్‌ లాబన్‌ పై నెగ్గాడు. మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో జోష్నా చినప్ప 9–11, 5–11, 13–15తో కెనడా ప్లేయర్ హోలీ నాటన్‌ చేతిలో ఓడిపోయింది.