Site icon HashtagU Telugu

India Playing XI vs WI: తొలి వన్డేకు భారత తుది జట్టు ఇదే

Team India New Feb 2

Team India New Feb 2

వెస్టిండీస్ తో జరగనున్న తొలి వన్డేకు భారత తుది జట్టుపై సందిగ్ధత నెలకొంది. మొన్నటి వరకూ జట్టులో ప్రతీ స్థానానికి ముగ్గురు ఆటగాళ్ళు అందుబాటులో ఉండడం ఒక తలనొప్పిగా ఉంటే.. ఇప్పుడు కరోనా కలకలం నేపథ్యంలో ఐదుగురు ప్లేయర్స్ దూరమవడం మరో సమస్యగా మారింది. వైరస్ దెబ్బకు తుది జట్టుపై కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ తర్జన భర్జన పడుతున్నప్పటకీ… ఆదివారం జరగనున్న మ్యాచ్ లో బరిలోకి దిగే 11 మంది జాబితాపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. నిజానికి క్వారంటైన్ పూర్తవడానికి 48 గంటల ముందు వైరస్ సోకడంతో ఓపెనర్ ధావన్ , రుతురాజ్ గైక్వాడ్ , శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరమయ్యారు. దీంతో ఓపెనింగ్ కాంబినేషన్ కు సంబంధింది రోహిత్ శర్మకు జోడీగా ఇప్పుడు ఇషాన్ కిషన్ లేక మయాంక్ అగర్వాల్ బరిలోకి దిగే అవకాశముంది. ఒకవేళ మయాంక్ ను తీసుకుంటే ఆదివారం ఉదయంతో అతని క్వారంటైన్ పూర్తవుతుంది. అంటే ప్రాక్టీస్ లేకుండా నేరుగా మ్యాచ్ లో ఆడాల్సి ఉంటుంది. ఒవేళ ఇషాన్ కిషన్ ఇప్పటికే జట్టుతో పాటే ఉండడంతో పెద్ద ఇబ్బంది లేదు.

అటు శ్రేయాస్ అయ్యర్ కరోనాతో దూరమవడం, జడేజా , అక్షర్ పటేల్ లేకపోవడంతో దీపక్ హుడా వన్డే అరంగేట్రం ఖాయంగా కనిపిస్తుంది. కోహ్లీ, సూర్యకుమార్, రిషబ్ పంత్ వారి వారి స్థానాల్లో ఆడనుండగా… ఇక శార్థూల్ ఠాకూర్ , దీపక్ చాహర్ లలో ఒకరికి చోటు దక్కనుంది. ఇదిలా ఉంటే బౌలింగ్ విభాగంలో పేస్ దళాన్ని హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ లీడ్ చేయనున్నాడు. బుమ్రాకు విశ్రాంతినివ్వడంతో సిరాజ్ ఇప్పుడు కొత్త బంతిని ప్రసిద్ధ కృష్ణతో పంచుకునే అవకాశముంది. అటు స్పిన్ విభాగంలో రెండు స్థానాల కోసం ముగ్గురు పోటీపడుతున్నారు. కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్ కు చోటు దక్కే అవకాశముండగా… వాషింగ్టన్ సుందర్ కూడా రేసులో ఉన్నాడు. మొత్తం మీద కరోనా ప్రభావంతో పలువురు కీలక ఆటగాళ్ళు దూరమైనా… కొందరు యువక్రికెటర్లకు అది వరంలా మారింది. దీపక్ హుడా, ఇషాన్ కిషన్ , మయాంక్ అగర్వాల్ లు తమకు వచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారో వేచి చూడాలి. కాగా ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుండగా.. కరోనా కారణంగా అభిమానులను అనుమతించడం లేదు.

Exit mobile version