Cape Town Test: మూడో టెస్టుకు భారత జట్టులో మార్పులివే!

భారత్, సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ ఫలితం కేప్ టౌన్ మ్యాచ్ తేల్చబోతోంది.సఫారీ పర్యటనలో తొలి టెస్టు గెలిచి జోరు మీద కనిపించిన భారత్ కు సెంచూరియన్ లో సౌతాఫ్రికా షాకిచ్చింది.

  • Written By:
  • Publish Date - January 7, 2022 / 05:40 PM IST

భారత్, సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ ఫలితం కేప్ టౌన్ మ్యాచ్ తేల్చబోతోంది.సఫారీ పర్యటనలో తొలి టెస్టు గెలిచి జోరు మీద కనిపించిన భారత్ కు సెంచూరియన్ లో సౌతాఫ్రికా షాకిచ్చింది. అనూహ్యంగా పుంజుకుని 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సఫారీ టీమ్ సిరీస్ ను 1-1తో సమం చేసింది. దీంతో చారిత్రక సిరీస్ విజయంపై కన్నేసిన భారత్ తుది జట్టులో మార్పులపై కసరత్తు చేస్తోంది. కేప్ టౌన్ వేదికగా జరగనున్న చివరి టెస్టులో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. రెండో టెస్ట్ చివరి నిమిషంలో వెన్నునొప్పితో తప్పుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో టెస్టుకు జట్టులోకి రానున్నాడు. దీంతో హనుమ విహారీ పెవిలియన్ కే పరిమితం కాక తప్పదు. రెండో టెస్టులో 40 పరుగులతో ఆకట్టుకున్నప్పటకీ.. విహారీని జట్టులో కొనసాగించే అవకాశాలు కనిపించడం లేదు.

మరోవైపు హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ గాయం నుండి కోలుకున్నా ఫిట్ నెస్ సమస్యలు ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ సిరాజ్ పూర్తిస్థాయిలో ఫిట్ నెస్ సాధించకుంటే మాత్రం అతని స్థానంలో ఉమేశ్ యాదవ్ లేదా ఇశాంత్ శర్మలలో ఒకరికి చోటు దక్కుతుంది. ఇదిలా ఉంటే వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను కొనసాగిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కీపర్ గా రాణిస్తున్నా బ్యాటింగ్ లో మాత్రం పంత్ పేలవ ఫామ్ లో ఉన్నాడు. అతను ఔటవుతున్న తీరుపైనే విమర్శలు వస్తున్నాయి. చెత్త షాట్లతో వికెట్ పారేసుకుంటున్నాడని కోచ్ రాహుల్ ద్రావిడ్ సైతం అంగీకరించాడు. దీంతో పంత్ స్థానంలో వృద్ధిమాన్ సాహాను తీసుకునే అవకాశాలూ లేకపోలేదు. గత ఏడాది కాన్పూర్ టెస్టులో సాహా హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగిలిన ఆటగాళ్ళు తుది జట్టులో కొనసాగనున్నారు. పుజారా, రహానే రెండో టెస్టులో హాఫ్ సెంచరీలు చేయడంతో వారి స్థానాలకు ఢోకా లేదు. మొత్తం మీద తుది జట్టులోకి కోహ్లీ రానుండడంతో సిరీస్ విజయంపై ఆశలు రేకెత్తుతున్నాయి. మూడో టెస్ట్ కేప్ టౌన్ వేదికగా జనవరి 11 నుండి ప్రారంభం కానుంది.