India Playing XI:తొలి టీ ట్వంటీలో భారత తుది జట్టు ఇదే

కరేబియన్ టూర్ లో భారత్ టీ ట్వంటీ సీరీస్ కు రెడీ అయింది. వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసి జోరుమీదున్న టీమిండియా ఇప్పుడు షార్ట్ ఫార్మాట్ విజయంపై కన్నేసింది.

  • Written By:
  • Publish Date - July 29, 2022 / 12:01 PM IST

కరేబియన్ టూర్ లో భారత్ టీ ట్వంటీ సీరీస్ కు రెడీ అయింది. వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసి జోరుమీదున్న టీమిండియా ఇప్పుడు షార్ట్ ఫార్మాట్ విజయంపై కన్నేసింది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్‌ లారా స్టేడియం వేదికగా ఇవాళ ఇరు జట్ల మధ్య తొలి టీ ట్వంటీ జరుగనుంది. వన్డేల్లో విండీస్‌ను వైట్‌వాష్‌ చేసిన జట్టులోని చాలామంది సభ్యులు ఈ సిరీస్‌ను అందుబాటులో ఉండకపోవడంతో జట్టు కూర్పు ఎలా ఉండబోతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్‌లో భారత జట్టును రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ నడిపించనుండగా.. హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్ వంటి సీనియర్ ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. రోహిత్ శర్మకు జతగా రిషభ్ పంత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. కరోనా కారణంగా రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ సిరీస్‌కు దూరంగా ఉండటంతో పంత్‌కు ప్రమోషన్‌ లభించే ఛాన్స్‌ ఉంది. ఈ ఆప్షన్‌ వల్ల దినేశ్‌ కార్తీక్‌కు కూడా తుది జట్టులో చోటు దక్కనుంది.

మిడిలార్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్‌ల బెర్తులు దాదాపుగా ఖరారేనని చెప్పాలి. ఆల్‌రౌండర్ల కోటాలో దీపక్‌ హుడా, హార్దిక్ పాండ్యా, అక్షర్‌ పటేల్‌లు తుది జట్టులో ఉండే అవకాశాలు ఉన్నాయి.వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టీ ట్వంటీ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అయ్యర్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. సూర్య వన్డే సిరీస్‌లో విఫలమయ్యాడు. మూడు వన్డేల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. మరోవైపు ఇంగ్లండ్ గడ్డపై అదరగొట్టిన హార్దిక్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. మొకాలి గాయంతో వన్డే సిరీస్‌లో బెంచ్‌కే పరిమితమైన రవీంద్ర జడేజా టీ ట్వంటీ సిరీస్ ఆడటంపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. అతను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడనే విషయంపై స్పష్టత లేదు.
బౌలర్ల విషయానికొస్తే ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో దుమ్మురేపిన భువనేశ్వర్ కుమార్.. మళ్లీ ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అతనితో పాటు హర్షల్ పటేల్ పేస్ బాధ్యతలను పంచుకోనున్నాడు. స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్‌, అశ్విన్ లలో ఒకరికి తుది జట్టులో తీసుకుంటారు. బ్యాటింగ్ సామర్థ్యం ఉన్న అశ్విన్‌కు అవకాశం దక్కవచ్చు.