World Cup: వరల్డ్‌కప్‌కు ముందే భారత్‌-పాక్ మ్యాచ్

చిరకాల ప్రత్యర్థులు భారత్‌,పాకిస్థాన్ మధ్య క్రికెట్ సమరం అంటే ఈ రెండు దేశాల అభిమానులకే కాదు ప్రపంచ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు కూడా ఎంతో ఆసక్తి.

Published By: HashtagU Telugu Desk
Team India

Team India

చిరకాల ప్రత్యర్థులు భారత్‌,పాకిస్థాన్ మధ్య క్రికెట్ సమరం అంటే ఈ రెండు దేశాల అభిమానులకే కాదు ప్రపంచ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు కూడా ఎంతో ఆసక్తి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగకపోవడంతో ఐసీసీ టోర్నీల్లోనే భారత్,పాక్ ఎదురుపడుతున్నాయి. ఈ ఏడాది టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో దాయాది దేశాల సమరం ఉండబోతోంది. అయితే దీని కంటే ముందే భారత్,పాకిస్థాన్ మ్యాచ్ అభిమానులను అలరించబోతోంది. శ్రీలంక వేదికగా జరగనున్న ఆసియాకప్‌ క్రికెట్ టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు తలపడబోతున్నాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగష్ట్ 27 నుంచి సెప్టెంబర్ 11 వరకూ ఆసియా కప్ జరగనుంది. ఈ సారి టీ ట్వంటీ ఫార్మేట్‌లో టోర్నీని నిర్వహించనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. భారత్ , పాకిస్థాన్ జట్లతో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, ఆసియా ఖండానికి చెందిన మరో జట్టు తలపడుతుందని ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ వెల్లడించింది. ఆరో జట్టును క్వాలిఫైయిర్ ద్వారా తర్వాత ఎంపిక చేయనున్నట్టు తెలిపింది.

ఆగష్ట్ 20 నుంచి యూఏఈ, కువైట్, సింగపూర్, హాంకాంగ్ జట్ల మధ్య క్వాలిఫైయర్స్ మ్యాచ్‌లతో ఆసియా కప్ షురూ కానుంది. కరోనా కారణంగా 2020 ఆసియాకప్‌ 2021కి వాయిదా పడింది. అప్పుడు కూడా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో 2022కు వాయిదా వేశారు. 2020 ఆసియా కప్‌కు శ్రీలంక 2022 ఎడిషన్‌కు పాక్ ఆతిథ్యమివ్వాల్సి ఉంది. ఈ ఏడాది లంక ఆతిథ్యమిస్తుండగా… 2023లో జరిగే ఆసియాకప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా ఆసియాకప్ చరిత్రలో ఇది 15వ ఎడిషన్‌, ఈ టోర్నీలో మోస్ట్ సక్సెస్‌ఫుల్‌గా టీమ్‌గా భారత్‌ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ భారత జట్టు ఏడుసార్లు ఆసియాకప్ గెలుచుకుంది. ఇదిలా ఉంటే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా బీసీసీఐ సెక్రటరీ జైషా పదవీకాలం పొడిగిస్తూ వార్షిక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ నజ్ముల్ హస్సవ్‌ నుంచి జైషా బాధ్యతలు తీసుకున్నారు. తాజా నిర్ణయంతో 2024 ఏజీఎం వరకూ జైషా ఈ పదవిలో కొనసాగనున్నారు.

  Last Updated: 20 Mar 2022, 10:06 AM IST