India vs Bangladesh 2nd Test : చేతిలో 6 వికెట్లు.. గెలుపుకు 100 పరుగులు

మూడో రోజు బౌలర్ల ఆధిపత్యం కనిపించింది. మరోసారి సమిష్టిగా రాణించిన భారత బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో

భారత్‌ (India), బంగ్లాదేశ్ (Bangladesh) రెండో టెస్ట్ (2nd Test Match) రసవత్తరంగా సాగుతోంది. మూడో రోజు బౌలర్ల ఆధిపత్యం కనిపించింది. మరోసారి సమిష్టిగా రాణించిన భారత బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను (Bangladesh) 231 పరుగులకే ఆలౌట్ చేసారు. ఓపెనర్ జకీర్ హసన్, లిట్టన్ దాస్ హాఫ్ సెంచరీలతో ఆదుకోకుంటే బంగ్లా మరింత తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యేది. వీరిద్దరినీ ఔట్ చేయలేకపోవడంతో బంగ్లా స్కోర్ 200 దాటగలిగింది. చివర్ల నురుల్ హసన్, టస్కిన్ అహ్మద్ కూడా రాణించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3, మహ్మద్ సిరాజ్ , అశ్విన్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

తర్వాత 145 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్‌కు బంగ్లా బౌలర్లు షాకిచ్చారు. ఆరంభంలోనే ఓపెనర్లను పెవిలియన్‌కు పంపారు. పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న కెఎల్ రాహుల్ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 2 రన్స్‌కే ఔటయ్యాడు. అటు మరో ఓపెనర్ శుభ్‌మన్‌గిల్ కూడా విఫలమయ్యాడు. ఆ తరవాత పుజారా 6, కోహ్లీ 1 పరుగుకే ఔటవడంతో టీమిండియా 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అక్షర్ పటేల్, ఉనాద్కట్ వికెట్ల పతానాన్ని అడ్డుకున్నారు. విజయం కోసం భారత్ (India) ఇంకా 100 రన్స్ చేయాల్సి ఉండగా.. 6 వికెట్లు చేతిలో ఉన్నాయి.

ప్రస్తుతం పిచ్ బౌలర్లకు అనుకూలిస్తున్న నేపథ్యంలో భారత్‌ విజయం సాధిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ పిచ్‌పై కాసేపు క్రీజులో నిలదొక్కుకుంటే మిగిలిన 100 రన్స్ చేయడం పెద్ద కష్టం కాదని చెప్పొచ్చు. బంగ్లా ఇన్నింగ్స్‌లో లిట్టన్ దాస్, జకీర్‌ ఇదే విధంగా రాణించారు. ప్రస్తుతం క్రీజులో ఉన్న అక్షర్ పటేల్ దూకుడుగా ఆడుతున్నాడు. తనపై ఉన్న అంచానాలను నిలబెట్టుకుంటున్న అక్షర్ పటేల్ 3 ఫోర్లతో 26 పరుగులు చేశాడు. భారత బ్యాటింగ్‌లో ఇంకా రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ ఉండడంతో గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు. మొత్తం మీద నాలుగోరోజు ఆట తొలి రెండు సెషన్లలోనే ఫలితం రానుంది.

Also Read:  COVID – 19 in China : డ్రాగన్‌ కంట్రీలో కోవిడ్ విలయతాండవం