Site icon HashtagU Telugu

IND vs SL 3rd ODI: 27 ఏళ్ల ఇజ్జత్ భారత్ చేతుల్లో, కాపాడుతారా?

IND vs SL 3rd ODI

IND vs SL 3rd ODI

IND vs SL 3rd ODI: ఈ రోజు భారత్-శ్రీలంక మధ్య మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకోవాలని టీం ఇండియా భావిస్తోంది. గత రెండు మ్యాచ్‌ల్లో భారత్ బ్యాటింగ్ పూర్తిగా ఫ్లాప్ కాగా, రెండు సార్లు టీమ్ ఇండియా ఆలౌట్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో మూడో మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ల ప్రదర్శనపై అందరి ద్రుష్టి పడింది. ఇక సిరీస్ కోల్పోతే టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గత 27 ఏళ్లుగా శ్రీలంకతో ఏ ద్వైపాక్షిక సిరీస్‌ను కోల్పోలేదు. భారత్ చివరిసారిగా 1997లో శ్రీలంకతో వన్డే సిరీస్‌ను కోల్పోయింది. అర్జున రణతుంగ నేతృత్వంలోని శ్రీలంక జట్టు సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని భారత జట్టును 3-0తో ఓడించింది. దీని తరువాత భారత్ మరియు శ్రీలంక మధ్య మొత్తం 11 ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు జరిగాయి. ఈ కాలంలో ఫలితాలు టీమ్ ఇండియాకు అనుకూలంగా వచ్చాయి.

ప్రస్తుత సిరీస్‌ను పరిశీలిస్తే విజిటింగ్‌ టీమ్‌ 0-1తో వెనుకంజలో ఉంది. భారత్-శ్రీలంక మధ్య తొలి వన్డే టై అయింది. అనంతరం రెండో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ సిరీస్‌లో టీమిండియా వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రీలంక స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు బ్యాట్స్‌మెన్లు కిందామీదా పడుతున్నారు. ఆతిథ్య జట్టు స్పిన్నర్ల ధాటికి భారత బ్యాట్స్‌మెన్‌లు ఒక్కొక్కరుగా నేలకూలుతున్నారు. ఆరంభంలో రోహిత్ దూకుడుగా ఆడి బాధ్యతాయుతమైన స్కోర్ అందిస్తున్నప్పటికీ మిగతా బ్యాటర్లు దాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు. చివర్లో బౌలర్లపై ఒత్తిడి పెరుగుతుంది.

విరాట్ కోహ్లీ ప్రదర్శనపై ఆందోళన వ్యక్తమవుతోంది.ప్రస్తుతం జరుగుతున్న కొలంబో మైదానంలో విరాట్ కోహ్లీ నాలుగు సెంచరీలు చేశాడు. కానీ అదే మైదానంలో కోహ్లీ తడబడటం ఆందోళన కలిగిస్తుంది. స్పిన్నర్లపై శివమ్ దూబే దూకుడుగా ఆడుతాడు. కానీ లంక రెగ్యులర్ లెగ్ స్పిన్‌ దళాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలో మూడో వన్డేలో శివమ్ దూబే స్థానంలో రియాన్ పరాగ్‌ను ప్రయత్నించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తుంది. పరాగ్ దూకుడు బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా స్పిన్ బౌలర్ కూడా. అతను ప్రత్యర్థి జట్టుకు ఇబ్బందులు సృష్టించగలడు. ఇక శ్రేయాస్ అయ్యర్ మరియు KL రాహుల్ స్పిన్నర్లపై మంచి రికార్డుల్ని నెలకొల్పారు. కానీ శ్రీలంక స్పిన్నర్లకు వ్యతిరేకంగా స్ట్రైక్ రొటేట్ చేయడంలో ఇద్దరు బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఏదేమైనప్పటికీ తన దూకుడు ధోరణితో ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడికి గురిచేసిన కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి భారత బ్యాట్స్‌మెన్లు గుణపాఠం నేర్చుకోవాలి.

Also Read: Shravana Masam 2024: శ్రావణమాసంలో 4 శుక్రవారాలు ఇలా చేస్తే చాలు.. అదృష్టం పట్టిపీడించడం ఖాయం!