Jaffer :రాహుల్ కంటే రహానే బెస్ట్ ఛాయిస్ : జాఫర్

కొత్త ఏడాదిని భారత క్రికెట్ జట్టు ఓటమితో ఆరంభించింది. సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ విజయానికి అడుగుదూరంలో నిలిచిన టీమిండియా అనూహ్యంగా జోహెనస్ బర్గ్ లో పరాజయం పాలైంది.

  • Written By:
  • Updated On - January 7, 2022 / 04:28 PM IST

కొత్త ఏడాదిని భారత క్రికెట్ జట్టు ఓటమితో ఆరంభించింది. సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ విజయానికి అడుగుదూరంలో నిలిచిన టీమిండియా అనూహ్యంగా జోహెనస్ బర్గ్ లో పరాజయం పాలైంది. బౌలర్లు అంతగా ప్రభావం చూపలేకపోవడం, బ్యాటర్లు సమిష్టిగా రాణించకపోవడం ఈ ఓటమికి కారణాలుగా పలువురు విశ్లేషిస్తున్నారు. అయితే కెప్టెన్ కోహ్లీ అందుబాటులో లేకపోవడం పెద్ద కారణంగా కూడా చెబుతున్నారు. అయితే కోహ్లీ స్థానంలో కెఎల్ రాహుల్ కు కాకుండా రహానేను తాత్కాలిక కెప్టెన్ గా బరిలోకి దింపితే బావుండేదని మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. రాహుల్ కు కెప్టెన్ గా ఇదే తొలి టెస్ట్ కావడంతో అంత దూకుడుగా నడిపించలేకపోయాడనేది పలువురి అభిప్రాయం. అటు రాహుల్ కెప్టెన్సీని తాను తక్కువగా చెప్పడం లేదన్న జాఫర్… 2020లో ఆసీస్ గడ్డపై రహానే కెప్టెన్సీలోనే భారత్ సిరీస్ గెలిచిందన్న విషయం మరిచిపోకూడదన్నాడు. బ్యాటింగ్ పరంగా ఫామ్ లో లేకున్నా తాత్కాలిక కెప్టెన్సీ చేసేందుకు అది పెద్ద అడ్డంకి కాబోదని వ్యాఖ్యానించాడు.

ఈ మ్యాచ్ కు ముందు కోహ్లీ వెన్నునొప్పితో చివరి నిమిషంలో తప్పుకోవడంతో కెఎల్ రాహుల్ కు పగ్గాలు అప్పగించారు. అయితే కోహ్లీ తరహాలో కాకున్నా ఓ మాదిరిగా కూడా రాహుల్ దూకుడుగా వ్యవహరించలేదన్నది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే సౌతాఫ్రికా లాంటి జట్టుపై అనుభవమున్న రహానేనే కెప్టెన్ గా కంటిన్యూ చేస్తే బావుండేదని జాఫర్ విశ్లేషించాడు. రాహుల్ ఇంకా అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో సారథిగా తొలి దశలోనే ఉండడంతో రహానేకు బాధ్యతలు ఇచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. భవిష్యత్తు కెప్టెన్ గా రాహుల్ ను చాలా మంది భావిస్తున్నప్పటకీ… ప్రస్తుతం జట్టులో ఉన్న రహానేను పక్కన పెట్టడం సరికాదని జాఫర్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్టుపై పలువురు సీనియర్లు లేకున్నా యువ ఆటగాళ్ళతో రహానే జట్టును అద్భుతంగా లీడ్ చేసాడని గుర్తు చేశాడు.