India vs South Africa : టీమిండియాను ఊరిస్తున్న వరల్డ్ రికార్డ్

రెండు నెలల పాటు క్రికెట్‌ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించిన ఐపీఎల్‌ ముగియడంతో ఇక ప్లేయర్స్ తో పాటు ఫాన్స్ కూడా అంతర్జాతీయ క్రికెట్ కు సన్నద్ధమవుతున్నారు.

  • Written By:
  • Publish Date - June 5, 2022 / 08:36 AM IST

రెండు నెలల పాటు క్రికెట్‌ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించిన ఐపీఎల్‌ ముగియడంతో ఇక ప్లేయర్స్ తో పాటు ఫాన్స్ కూడా అంతర్జాతీయ క్రికెట్ కు సన్నద్ధమవుతున్నారు. ఈఏడాది చివర్లో టీట్వంటీ వరల్డ్‌కప్‌ జరగనున్న నేపథ్యంలో తమ బలాబలాలు ఎలా ఉన్నాయో చూసుకునే పనిలో పలు జట్లు వున్నాయి. ఇందులో భాగంగా టీమిండియా తమ తొలి టీట్వంటీ సిరీస్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది.

ఇప్పటికే ఐదు టీట్వంటీల సిరీస్‌ కోసం సఫారీలు భారత గడ్డపై అడుగుపెట్టారు. ఈ నెల 9న న్యూఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ కీలకమైన సిరీస్‌కు రోహిత్‌, విరాట్‌ కోహ్లి, బుమ్రాలాంటి సీనియర్‌ ప్లేయర్స్‌ లేకుండానే బరిలోకి దిగుతున్న యంగిండియా.. టీ ట్వంటీల్లో ఓ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉంది. తొలి ట్వంటీలోనే ఆ రికార్డు బ్రేకయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే టీట్వంటీల్లో వరుసగా 12 విజయాలతో ప్రపంచ రికార్డును భారత్ సమం చేసింది. ఇప్పుడు సౌతాఫ్రికాపై తొలి టీట్వంటీ గెలిస్తే చరిత్ర సృష్టిస్తుంది. ఈ విజయం షార్ట్ ఫార్మాట్‌లో టీమిండియాను ఆల్‌టైమ్‌ గ్రేట్ టీమ్‌గా నిలబెడుతుందనడంలో సందేహం లేదు. ఈ సిరీస్‌కు కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌ కాగా.. రిషబ్‌ పంత్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. హార్దిక్‌ పాండ్యా, దినేష్‌ కార్తీక్‌లాంటి టాప్‌ ఫామ్‌లో ఉన్న ప్లేయర్స్‌ తిరిగి టీమ్‌లోకి రావడంతో చాలా బలంగా కనిపిస్తోంది.
అయితే అటు సౌతాఫ్రికా టీమ్‌ను కూడా తేలిగ్గా తీసుకొలేని పరిస్థితి.. కగిసో రబాడా, ఆన్రిచ్‌ నోక్యా, క్వింటన్‌ డికాక్‌, డేవిడ్‌ మిల్లర్‌, కెప్టెన్‌ టెంబా బవుమాలాంటి ప్లేయర్స్‌ ఉన్నారు. ఈ మధ్యే ముగిసిన ఐపీఎల్‌లో డికాక్‌, మిల్లర్‌ సూపర్ ఫామ్ తో అదరగొట్టారు. ముఖ్యంగా మిల్లర్‌ చాలా రోజుల తర్వాత తనలోని ఫినిషర్‌ను చూపిస్తున్నాడు. అటు డికాక్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓపెనర్‌గా మెరుపులు మెరిపించాడు.. దీంతో టీమిండియా వరల్డ్ రికార్డ్ సాధించాలంటే సమిష్టిగా రాణించాల్సిందే.