Commonwealth Games 2030 : భారత్ అంతర్జాతీయ క్రీడా ప్రపంచంలో తన స్థానాన్ని మరింత బలపరచుకునేందుకు అడుగులు వేస్తోంది. ఇప్పటికే 2036 ఒలింపిక్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆసక్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్ సిద్ధమవుతోందని స్పష్టమైంది. భారత ఒలింపిక్ అసోషియేషన్ (IOA) ఇటీవల జరిగిన ప్రత్యేక సాధారణ సమావేశంలో, ఈ ప్రతిష్టాత్మక క్రీడా ఉత్సవానికి బిడ్ దాఖలు చేయాలని నిర్ణయించింది. 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ కోసం ఆసక్తి ఉందని ఇప్పటికే మార్చిలోనే IOA “ఇంట్రెస్ట్ ఆఫ్ హోస్టింగ్” లేఖను అధికారికంగా పంపించింది. బిడ్ దాఖలుకు చివరి తేదీ ఈ నెల 31వ తేదీగా నిర్ణయించబడింది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కూడా ఈ ప్రపోజల్‌కు మద్దతు ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌ను ప్రధాన వేదికగా పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Read Also: Sonia Gandhi : సోనియాగాంధీకి ఇటలీ పౌరురాలిగా ఓటు.. బీజేపీ ఎదురుదాడి
అహ్మదాబాద్ ఇటీవల నెలకొన్న వర్ల్డ్‌క్లాస్ క్రీడా మౌలిక వసతులతో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించేందుకు అనువైన కేంద్రంగా మారుతోంది. ఇదే పట్టణం 2036 ఒలింపిక్ గేమ్స్‌కు కూడా ప్రధాన వేదికగా ఉండే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, భారత్ ఇప్పటికే 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఆఅనుభవాన్ని పునరావృతం చేస్తూ, ఇప్పుడు మరింత ఆధునిక మౌలిక సదుపాయాలతో గేమ్స్‌కు సిద్ధమవుతోంది. ఇక, పోతే, క్రీడల నిర్వహణలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు భారత్ ఇతర పోటీల విషయంలోనూ ఉత్సాహంగా ఉంది. ఇటీవల అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AFI) ఆధ్వర్యంలో భువనేశ్వర్‌లో జరిగిన కాంటినెంటల్ టూర్ బ్రాంజ్ లెవల్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఇదే తరహాలో, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ అథ్లెటిక్స్ టోర్నీలకు ఆతిథ్యాన్ని అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని AFI మాజీ ప్రతినిధి, ప్రస్తుత వరల్డ్ అథ్లెటిక్స్ వైస్ ప్రెసిడెంట్ అదిల్లె సుమిరివాలా తెలిపారు.
ఆయన ప్రకారం, భారత్ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌ను కూడా నిర్వహించాలన్న లక్ష్యంతో ఉంది. ఇది ప్రతి రెండు సంవత్సరాలకు జరిగే ప్రపంచ స్థాయి పోటీ. ఈ టోర్నీని 2029లో భువనేశ్వర్‌లో, 2031లో అహ్మదాబాద్‌లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భారత్‌లో ఇలాంటి పెద్ద ఈవెంట్లు జరిగితే దేశీయ క్రీడాకారులకు ప్రోత్సాహమే కాక, స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఉత్సాహం కలుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్రీడల ద్వారా దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం ఇదని అధికారులు భావిస్తున్నారు. అంతర్జాతీయ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా క్రీడా పర్యాటకం, మౌలిక వసతుల అభివృద్ధి, స్థానిక యువతలో స్పోర్ట్స్ స్పిరిట్‌ను పెంపొందించే దిశగా ఇది గొప్ప అవకాశంగా మారనుంది.
Read Also: Heavy rains : నేడు, రేపు తెలంగాణ అంతటికీ రెడ్ అలర్ట్ : వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న