Head to Head Records: రికార్డులు మనవైపే..!

టీ ట్వంటీలో ఎవరినీ ఫేవరెట్‌గా చెప్పలేం.. అన్నింటికీ మించి రెండు బెస్ట్ టీమ్స్‌ తలపడుతుంటే

  • Written By:
  • Updated On - November 10, 2022 / 10:02 AM IST

టీ ట్వంటీలో ఎవరినీ ఫేవరెట్‌గా చెప్పలేం.. అన్నింటికీ మించి రెండు బెస్ట్ టీమ్స్‌ తలపడుతుంటే విన్నర్‌పై అంచనాలు కష్టమే..అయితే గత రికార్డుల్లో పై చేయి ఉన్న జట్టుకు మాత్రం కాస్త ఎడ్జ్ ఉంటుందనే చెప్పాలి. ఆ రోజు ఎవరు బాగా ఆడితే వారే గెలుస్తారన్నది వాస్తవమే అయినప్పటకీ రికార్డులు అనుకూలంగా ఉంటే మాత్రం కాన్ఫిడెన్స్‌ కూడా పెరుగుతుందనేది అంగీకరించాలి. ఇంగ్లండ్‌తో జరగనున్న సెమీఫైనల్లో టీమిండియానే గెలుస్తుందని చాలా మంది అంచనా వేస్తున్నారు.

వీరి నమ్మకానికి టీమిండియా ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్‌ ఒక కారణంగా చెప్పాలి. బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, వరుస హాఫ్‌సెంచరీలతో చెలరేగి పోతుంటే.. బౌలర్లు అర్షదీప్‌ సింగ్‌, మహ్మద్‌ షమీ, హార్ధిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌ సత్తా చాటుతున్నారు. ఫలితంగా మెగా టోర్నీలో టీమిండియా నిలకడగా రాణిస్తోంది. టీమిండియా వరుస విజయాలు సాధించడంలో వీరిదే కీ రోల్‌. భారత ఆటగాళ్లు సూపర్‌ ఫామ్‌కు తోడు గత రికార్డులు కూడా అనుకూలంగా ఉండడం మరో కారణంగా చెప్పొచ్చు. గత రికార్డులను చూస్తే టీ20 ఫార్మాట్‌లో ఓవరాల్‌గా ఇంగ్లీష్ టీమ్‌పై మనదే చేయిగా ఉంది. ఇరు జట్లు 22 సార్లు తలపడగా.. భారత్‌ 12 సార్లు, ఇంగ్లండ్‌ 10 మ్యాచ్‌లలో విజయం సాధించాయి. టీ20 ప్రపంచకప్‌లోనూ భారత్‌దే ఆధిపత్యం. ఇరు జట్లు 3 సార్లు తలపడితే…టీమిండియా 2, ఇంగ్లండ్‌ 1 మ్యాచ్‌లో గెలిచాయి.

అలాగే చివరి ఐదు టీ ట్వంటీల్లో నాలుగింటిలో భారత్‌దే విజయం. మరోవైపు మ్యాచ్‌కు వేదిక అయిన అడిలైడ్‌లో ఇంగ్లండ్‌కు చెత్త రికార్డు ఉండటం టీమిండియాకు అదనంగా కలిసొచ్చే అంశం. ఈ స్టేడియంలో ఇంగ్లండ్‌ 17 వన్డేలు ఆడగా.. కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఇదిలా ఉంటే అడిలైడ్‌లో కింగ్ కోహ్లీకి అద్భుతమైన రికార్డుంది. ఇక్కడ మ్యాచ్ అంటేనే పూనకం వచ్చినట్టు చెలరేగిపోతాడు విరాట్‌. మూడు ఫార్మాట్లలో కలిపి ఇక్కడ అతను ఆడిన 14 ఇన్నింగ్స్‌ల్లో 75.5 సగటున 907 పరుగులు చేశాడు. ఇక్కడ రెండు టీ ట్వంటీల్లోనూ కోహ్లీ హాఫ్ సెంచరీలు సాధించాడు. బంగ్లాదేశ్‌తో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో విరాట్ 64 పరుగులతో అదరగొట్టాడు. ఇటు కోహ్లీకి అచ్చొచ్చిన గ్రౌండ్.. అటు మిస్టర్ 360 సూపర్ ఫామ్‌ ఓవరాల్‌గా టీమిండియా రికార్డులు సెమీస్‌కు ముందు ఇంగ్లాండ్‌ను టెన్షన్ పెడుతున్నాయి.