Ind Vs SA: సమం చేస్తారా…సమర్పిస్తారా..?

సొంతగడ్డపై ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన టీమిండియా ఇప్పుడు సౌతాఫ్రికాతో నాలుగో టీ ట్వంటీకి సన్నద్ధమైంది.

  • Written By:
  • Publish Date - June 17, 2022 / 09:45 AM IST

సొంతగడ్డపై ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన టీమిండియా ఇప్పుడు సౌతాఫ్రికాతో నాలుగో టీ ట్వంటీకి సన్నద్ధమైంది. సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన విశాఖ మ్యాచ్‌లో జూలువిదిల్చిన భారత్ మరోసారి అదే ప్రదర్శన కనబరిచేందుకు ఉవ్విళ్ళూరుతోంది. విశాఖ విజయం టీమిండియాకు ఖఛ్ఛితంగా కాన్ఫిడెన్స్ పెంచేదే. వరుసగా రెండు ఓటముల తర్వాత తీవ్ర ఒత్తిడిలో అద్భుత ప్రదర్శన కనబరిచింది.

అన్ని విభాగాల్లోనూ రాణించి సఫారీ జోరుకు బ్రేక్ వేసింది. అయితే సిరీస్ చేజారిపోయే ప్రమాదం ఇంకా పొంచి ఉన్న వేళ కటక్ వేదికగా మరోసారి సమిష్టిగా రాణించాలని పట్టుదలగా ఉంది. ఓపెనర్లు రాణిస్తున్నా…మిడిలార్డర్‌ నిలకడలేమి ఆందోళన కలిగిస్తోంది. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించని పంత్ కెప్టెన్‌గానూ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. దీంతో భారత్‌కు కీలకంగా మారిన నాలుగో టీ ట్వంటీలో పంత్ భారీ ఇన్నింగ్స్‌ ఆడాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. అటు బౌలింగ్‌లో తొలి మ్యాచ్‌ ప్రదర్శనను పక్కన పెడితే.. భారత బౌలర్ల ప్రదర్శన మెరుగ్గానే ఉంది.

ప్రధాన స్పిన్నర్‌ చాహల్‌ ఫామ్‌లోకి రావడం కలిసొచ్చే అంశం. పేసర్లు భువనేశ్వర్‌ కుమార్, హర్షల్‌ పటేల్‌ తొలి టీ20 తర్వాత గొప్పగా పుంజుకున్నారు. అక్షర్‌ పటేల్‌, అవేష్‌ ఖాన్‌ల నుంచి జట్టు ఇంకా మెరుగైన ప్రదర్శన ఆశిస్తోంది. అవేష్‌ బాగానే బౌలింగ్‌ చేస్తున్నప్పటికీ.. సిరీస్‌లో ఇప్పటిదాకా వికెట్టే తీయలేదు. దీంతో అతని స్థానంలో అర్షదీప్‌సింగ్‌కు చోటు దక్కొచ్చు.

మరోవైపు వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన సౌతాఫ్రికా విశాఖ టీ ట్వంటీలో ఓడిపోవడానికి బ్యాటింగ్ వైఫల్యమే కారణంగా చెప్పొచ్చు. నాలుగో టీ ట్వంటీకి వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ తుది జట్టులోకి రానుండడం వారి బలాన్ని పెంచేదే. గత మ్యాచ్‌లో విఫలమైనప్పటకీ. క్లాసల్, మిల్లర్‌లు సఫారీ జట్టులో ప్రమాదకరమైన బ్యాటర్లనడంలో ఏమాత్రం సందేహం లేదు. వీరిద్దరినీ కట్టడి చేయడంపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

అటు సఫారీ బౌలర్లకు నిలకడలేమి ప్రధాన సమస్యగా మారింది. దీంతో మరోసారి సమిష్టిగా రాణిస్తే తప్ప భారత గడ్డపై సిరీస్ గెలవలేమని సౌతాఫ్రికా భావిస్తోంది. ఇదిలా ఉంటే మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న రాజ్‌కోట్ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్‌లోనూ భారీస్కోర్లు నమోదయ్యే అవకాశముంది. టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కే మొగ్గుచూపనుండగా.. ఓవరాల్‌గా మ్యాచ్‌లో స్పిన్నర్లు కీలకం కానున్నారని భావిస్తున్నారు.