Site icon HashtagU Telugu

India Beat Bangladesh: మూడో వన్డేలో భారత్ ఘనవిజయం

Teamindia

Teamindia Imresizer (1)

(Team India) బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకుంది. సిరీస్ చేజార్చుకున్న భారత్ 227 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించి క్లీన్‌స్వీప్ పరాభవాన్ని తప్పించుకుంది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు డామినేట్ చేసింది. ఏ దశలోనూ బంగ్లాదేశ్ పోటీనివ్వలేకపోయింది. తొలి రెండు వన్డేల్లో ఓటమితో విమర్శలు ఎదుర్కొన్న భారత్‌ 409 పరుగుల భారీస్కోర్ చేసింది. ధావన్ త్వరగానే ఔటైనా… ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ అదరగొట్టారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో పలు రికార్డులు నెలకొల్పిన ఇషాన్ కిషన్ 126 బంతుల్లోనే ద్విశతకం సాధించాడు.

సెంచరీ చేసేందుకు 85 బంతులు ఆడిన ఇషాన్ కిషన్ తర్వాత 100 పరుగులు 41 బంతుల్లోనే సాధించాడంటే అతని జోరు ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు కోహ్లీ కూడా సత్తా చాటాడు. టీ ట్వంటీ ప్రపంచకప్ ఫామ్ కొనసాగిస్తూ మూడున్నరేళ్ళ తర్వాత శతకం^సాధించాడు. కోహ్లీకి ఇది అంతర్జాతీయ క్రికెట్‌లో 72వ శతకం. ఇషాన్ కిషన్ 131 బంతుల్లోనే 24 ఫోర్లు, 10 సిక్సర్లతో 210 పరుగులు చేయగా.. కోహ్లీ 91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 113 పరుగులు చేశాడు. వీరిద్దరి జోరుతో భారత్ రన్‌రేట్‌ ఓవర్‌కు 10కి పైగా సాగింది. చివర్లో వరుస వికెట్లు కోల్పోయినా భారత్ 400 పరుగుల మార్కు దాటింది. వన్డే క్రికెట్‌లో భారత్‌కు ఇది నాలుగో అత్యధిక స్కోర్‌. అలాగే 400 పరుగులకు పైగా స్కోర్ చేయడం ఇది ఆరోసారి.

కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఆరంభం నుంచే భారత బౌలర్లు కట్టడి చేయడంతో వరుస వికెట్లు కోల్పోయింది. షకీబుల్ హసన్ 43, లిట్టన్ దాస్ 29, యాసిర్ అలీ 25, హొస్సేన్ 20 పరుగులు చేశారు. గత మ్యాచ్‌లో డెత్ ఓవర్లలో విఫలమైన భారత బౌలర్లు ఈ సారి మాత్రం రాణించారు. దీంతో బంగ్లాదేశ్ 34 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో శార్థూల్ ఠాకూర్ 3 , అక్షర్ పటేల్ 2 , ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, కుల్‌దీప్‌యాదవ్,వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ తీశారు.