సొంత గడ్డ పై టీమ్ ఇండియాకు ఎదురే లేకుండా పోయింది. వన్డే సిరీస్ ను వైట్ వాష్ చేసిన రోహిత్ సేన ఇప్పుడు టీ ట్వంటీ సీరీస్ లోనూ విండీస్ ను స్వీప్ చేసేసింది. దీంతో చివరి మ్యాచ్ లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావించిన కరేబియన్ టీమ్ కు నిరాశ తప్పలేదు. ఈ మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ కు సంబంధించి సూర్య కుమార్ యాదవ్ ఇన్నింగ్స్ హైలైట్ గా చెప్పాలి. విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. భారీ సిక్సర్ల తో ఈడెన్ గార్డెన్స్ ను హోరెత్తించాడు.
సూర్య సిక్సర్లలో వేటికవే ప్రత్యేకంగా నిలిచాయి. అభిమానులు ముద్దుగా స్కై అని పిలుచుకునే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ కు ప్రత్యర్థి కెప్టెన్ సైతం ఫిదా అయ్యాడు. సూర్య కేవలం 31 బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఇందులో 7 సిక్స్‌లు, ఒక ఫోర్ ఉంది. వెంకటేశ్ అయ్యర్ 19 బంతుల్లో 35 పరుగులు చేయగా… ఇందులో 4 ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి. ఇషాన్ కిషన్ 34, శ్రేయస్ అయ్యర్ 25 పరుగులు చేశారు. దీంతో భారత్ 184 పరుగులు చేసింది.
185 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. వికెట్లు కోల్పోతున్నా నికోలస్ పూరన్ , పోవెల్ దాటిగా ఆడడంతో విండీస్ పవర్ ప్లే లో 68 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత భారత బౌలర్లు పుంజుకోవడంతో వారి జోరుకు బ్రేక్ పడింది. నికోలస్ పూరన్ ఒంటరి పోరాటం చేసినా మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో విండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. పూరన్ 47 బంతుల్లో 61 రన్స్ చేశాడు.
భారత బౌలర్లలో హర్షల్ పటేలే మూడు వికెట్లు తీయగా, దీపక్ చాహర్, వెంకటేశ్ అయ్యర్, షర్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. సూర్య కుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సీరీస్ అవార్డులు దక్కాయి. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల సిరీస్ ను టీమ్ ఇండియా 3-0 తో స్వీప్ చేసింది. అటు వన్డే సిరీస్ ను కూడా భారత్ 3-0 తో స్వీప్ చేయడంతో కరేబియన్ టీమ్ ఈ పర్యటనలో ఒక్క విజయం కూడా సాదించకుండానే ఇంటిదారి పట్టింది.
𝐓𝐇𝐀𝐓. 𝐖𝐈𝐍𝐍𝐈𝐍𝐆. 𝐅𝐄𝐄𝐋𝐈𝐍𝐆 ☺️ ☺️
What a performance this has been by the @ImRo45 -led #TeamIndia to complete the T20I series sweep! 🏆 👏#INDvWI | @Paytm pic.twitter.com/L04JzVL5Sm
— BCCI (@BCCI) February 20, 2022