Site icon HashtagU Telugu

Ind Vs Zim: కష్టంగా క్లీన్ స్వీప్… పోరాడి ఓడిన జింబాబ్వే

India Tour Of Zimbabwe

Ind Vs Zim

జింబాబ్వేతో వన్డే సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. తొలి రెండు వన్డేల్లో పెద్దగా ఆకట్టుకోని ఆతిథ్య జట్టు చివరి మ్యాచ్ లో మాత్రం భారత్ ను కంగారు పెట్టింది. చివరి వరకూ విజయం కోసం పోరాడి ఓడింది. చివర్లో బౌలర్లు కట్టడి చేయకుంటే భారత్ కు షాక్ తగిలేది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ కు దిగింది.కెప్టెన్ రాహుల్ తో పాటు ధావన్ మంచి ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్ కు 63 పరుగులు జోడించారు. కేఎల్ రాహుల్ 30 , ధావన్ 40 రన్స్ చేసి ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చిన శుభ్‌మ‌న్ గిల్‌, ఇషాన్ కిషన్ భారీ పార్టనర్ షిప్ తో ఆకట్టుకున్నారు. నిలకడగా ఆడి స్కోరును 200 పరుగులు దాటించారు. వీరు మూడో వికెట్ కు 140 పరుగులు భాగస్వామ్యం జోడించారు. ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యాడు . ఆ తర్వాత వచ్చిన దీపక్ హుడా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, శార్ధూల్ ఠాకూర్ నిరాశ పరిచారు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా శుభ్‌మ‌న్ మాత్రం నిలకడగా ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 97 బాల్స్ లో ఒక సిక్సర్, 15 ఫోర్లతో 130 పరుగులు చేశాడు. వన్డేల్లో శుభ్‌మ‌న్ కు ఇదే తొలి సెంచరీ. ఒకానొక దశలో టీమ్ ఇండియా సులభంగా మూడు వందలు రన్స్ దాటేలా కనిపించింది. చివరి బ్యాటర్లు విఫలం కావడంతో 289 పరుగులకు పరిమితమైంది. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్ ఐదు వికెట్లు తీయగా, నాయుచి, జాంగ్వే తలో ఒక్క వికెట్ దక్కించుకున్నారు.

290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 7 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. తర్వాత కైటానో రిటైర్‌హార్ట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో విలియమ్స్‌ 45 రన్స్ చేయగా…మరో ఎండ్ లో వికెట్లు కోల్పోయింది. ఒక దశలో 34 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగింది. అయితే సికిందర్ రాజా అద్భుత ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. భారత బౌలర్ల పై ఎదురుదాడికి దిగి పరుగులు సాధించాడు. దీంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. సికిందర్‌ రజా 87 బంతుల్లో రజా తన సెంచరీని పూర్తి చేశాడు.దీంతో జింబాబ్వే విజయానికి 18 బంతుల్లో 33 పరుగులు చేయాల్సి ఉండగా…భారత్ పై సంచలన విజయం సాధించేలా కనిపించింది. అయితే అవేష్ ఖాన్ వేసిన 48వ ఓవర్లో 16 పరుగులు చేసినప్పటికీ ..ఎవన్స్ వికెట్ చేజార్చుకుంది. దీంతో మిగిలిన రెండు వికెట్లను భారత్ బౌలర్లు తీయడంతో జింబాబ్వే ఇన్నింగ్స్ కు 276 రన్స్ దగ్గర తెరపడింది. 13 పరుగులతో గెలిచిన భారత్ సీరీస్ ను 3-0 తో స్వీప్ చేసింది. ఆవేష్ ఖాన్ 3 , దీపక్ చాహర్ , అక్షర్ పటేల్ , కులదీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.