Asian Champions Trophy: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ విజేత భారత్… ఫైనల్ లో మలేషియాపై విజయం

భారత హాకీ జట్టు అదరగొట్టింది. వరుస విజయాలతో దుమ్మురేపుతున్న టీమిండియా ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.

Asian Champions Trophy: భారత హాకీ జట్టు అదరగొట్టింది. వరుస విజయాలతో దుమ్మురేపుతున్న టీమిండియా ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో 4-3 గోల్స్ తేడాతో మలేషియాపై విజయం సాధించింది. భారత్ హాకీ జట్టు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇది నాలుగోసారి. ఈ టోర్నీ ఆరంభం నుండీ భారత్ ప్రదర్శన అద్భుతమనే చెప్పాలి. వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తూ తుదిపోరుకు దూసుకొచ్చింది. అయితే ఫైనల్లో భారత్ గెలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. మ్యాచ్ లో ఎక్కువ సేపు మలేషియానే ఆధిపత్యం కనబరిచింది. ఒక దశలో 3-1 గోల్స్ తేడాతో మలేషియా గెలుపు ఖాయంగా కనిపించింది. అయితే చివర్లో అనూహ్యంగా పుంజుకున్న భారత్ వరుస గోల్స్ తో మలేషియాను నిలువరించింది.

మ్యాచ్ 9వ నిమిషంలోనే జుగ్ రాజ్ సింగ్ గోల్ చేసి భారత్ కు ఆధిక్యాన్ని అందించినా.. తర్వాత వెనుకబడిపోయింది. వరుసగా 3 గోల్స్ తో మలేషియా ఆధిక్యంలో నిలిచింది. 45వ నిమిషంలో హర్మన్ ప్రీత్ సింగ్ గోల్ చేసి ఆధిక్యాన్ని తగ్గించాడు. కాసేపటికే గుర్జాత్ సింగ్ గోల్ చేయడంతో స్కోర్ సమమైంది. ఇక 56వ నిమిషంలో అక్ష్ దీప్ సింగ్ గోల్ చేయడంతో భారత్ 4-3 ఆధిక్యంలో నిలిచింది. తర్వాత మలేషియా ఎటాకింగ్ చేసినా భారత్ సమర్థంగా అడ్డుకుంది. స్కోర్ సమం చేసేందుకు మలేషియా కూడా చివరి వరకూ పోరాడినా భారత డిఫెండర్లు వారిని అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఫలితంగా భారత్ టైటిల్ కైవసం చేసుకుంది. గతంలో భారత హాకీ జట్టు 2011, 2016, 2018లలో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది.

Also Read: Hardik Pandya: పాండ్యపై మండిపడ్డ ఆకాశ్ చోప్రా