Lawn Ball Gold: చరిత సృష్టించిన భారత లాన్ బౌల్స్ టీమ్

ఒక్కోసారి ఆటల్లో మనం ఊహించనివి జరుగుతాయి...ఒక్క మాటలో చెప్పాలంటే అద్బుతం జరిగిందనీ చెప్పొచ్చు.

  • Written By:
  • Publish Date - August 2, 2022 / 10:14 PM IST

ఒక్కోసారి ఆటల్లో మనం ఊహించనివి జరుగుతాయి…ఒక్క మాటలో చెప్పాలంటే అద్బుతం జరిగిందనీ చెప్పొచ్చు. ఇప్పుడు
కామన్వెల్త్ గేమ్స్ లో భారత మహిళల లాన్ బౌల్స్ టీమ్ అలాంటి అద్భుతమే చేసింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా, పెద్దగా ఎవ్వరికీ పరిచయం లేని ఈవెంట్‌లో అంచనాలకు మించి రాణించిన భారత లాన్ బౌల్స్ టీమ్ స్వర్ణం గెలిచింది. అది కూడా ఫైనల్‌లో మూడు సార్లు ఛాంపియన్‌ టీమ్ సౌతాఫ్రికాని 17-10 తేడాతో ఓడించి బంగారు పతకం కైవసం చేసుకుంది. కామన్‌వెల్త్‌ క్రీడల చరిత్రలో తొలిసారి లాన్ బౌల్స్ క్రీడలో పతకాన్ని సాధించింది.

హోరాహోరీగా సాగిన ఫైనల్స్‌లో భారత్‌ పటిష్టమైన ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఆట ఆరంభంలో టీమిండియాను తక్కువ అంచనా వేసిన సఫారీ టీమ్‌.. ఆ తర్వాత తేరుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. ఒక దశలో దక్షిణాఫ్రికా 10-10తో స్కోర్‌ను సమం చేసుకున్నప్పటికీ.. ఆ తర్వాత టీమిండియా ప్రత్యర్ధిని అదే స్కోర్‌ వద్ద ఉంచి ఘన విజయం సాధించింది. భారత జట్టులో రూపా దేవి ట్రికీ, నయన్‌మోనీ సైకియా, లవ్లీ చౌబీ, పింకీ సింగ్ అద్భుతంగా రాణించారు. సెమీస్‌లో భారత్‌.. న్యూజిలాండ్‌ను 16-13 తేడాతో మట్టికరిపించి ఫైనల్‌కు చేరింది.