Rohit Sharma Retirement: టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. 38 ఏళ్ల రోహిత్ శర్మ 2013లో టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. 67 మ్యాచ్‌లు ఆడి 4301 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 18 అర్ధ సెంచరీలున్నాయి. రోహిత్ శర్మ సోషల్ మీడియాలో ఇలా వ్రాశాడు.. తెల్లటి జెర్సీలో నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన గౌరవం. సంవత్సరాలుగా మీ అందరి ప్రేమ మరియు మద్దతుకు ధన్యవాదాలు. నేను వన్డే ఫార్మాట్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటానని పేర్కొన్నాడు.
రోహిత్ ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. భారత్ తరఫున ఇక వన్డేల్లో మాత్రమే కొనసాగుతాడు. రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్ఇండియా ఒకసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో ఫైనల్‌కు చేరింది. జూన్‌లో భారత్ ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌కు ముందే రోహిత్ ఎందుకు రిటైర్ అయ్యాడనే దానిపై చాలా చర్చలు జరుగుతున్నాయి.
గౌతమ్ గంభీర్ తో వివాదం..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో వివాదం జరిగిందని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ మధ్య అంతా సజావుగా సాగడం లేదని ప్రచారం జరిగింది. సిడ్నీ టెస్ట్ సందర్భంగా రోహిత్‌ను ప్లేయింగ్ ఎలెవన్ నుండి తొలగించడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ సమయంలో రోహిత్ ఫామ్ చాలా పేలవంగా ఉందని విమర్శలు ఎదుర్కొన్నాడు. అదే సమయంలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను కోల్పోవడంతో రోహిత్ పై చాలా విమర్శలు వచ్చాయి. ఈ సమయంలో టెస్టుల నుంచి రిటైర్మెంట్ కావాలని బీసీసీఐ పెద్దల నుంచి సూచనలు కూడా వచ్చాయని ప్రచారం జరిగింది. అయితే, అప్పుడు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించేందుకు ససేమీరా అన్న రోహిత్.. ప్రస్తుతం తన రిటైర్మెంట్ ను ప్రకటించాడు. అతని రిటైర్మెంట్ వెనుక పలువురు ఒత్తిడి ఉందన్న వాదన లేకపోలేదు.
2027 ప్రపంచ కప్ పై దృష్టి..
రోహిత్ శర్మ వయసు 38 సంవత్సరాలు. అతను 2027 వన్డే ప్రపంచ కప్ ఆడాలనుకుంటే, అతను తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలి. రోహిత్ ఆకస్మిక పదవీ విరమణతో అతను తన పనిభారాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది. 2027 నాటికి అతనికి 40 సంవత్సరాలు నిండుతాయి, కాబట్టి అతను తనను తాను ఫిట్‌గా ఉంచుకోవాలనుకుంటున్నాడు. అయితే, వరల్డ్ కప్ కు మరో రెండేళ్ల సమయం ఉంది. అప్పటి వరకు రోహిత్ వన్డే జట్టులో ఉంటాడా అంటే అనేక సందేహాలు ఉన్నాయి. త్వరలో జరిగబోయే వన్డే సిరీస్ లలో రోహిత్ రాణించకపోతే సెలెక్టర్లు పక్కన పెట్టే అవకాశాలు లేకపోలేదు.
పేలవమైన ప్రదర్శన..
గత ఏడాది టెస్ట్ క్రికెట్‌లో రోహిత్ శర్మ పేలవమైన ప్రదర్శన చేశాడు. గతంలోలా ఫామ్ లోకి రావడానికి కష్టపడుతున్నట్లు కనిపించాడు. మొత్తం మీద గత సీజన్‌లో ఎనిమిది టెస్టుల్లో కేవలం ఒక అర్ధ సెంచరీ మాత్రమే రోహిత్ సాధించాడు. సగటున 10.93 సాధించాడు. కెప్టెన్సీ గురించి మాట్లాడుకుంటే.. మొత్తం 24 టెస్ట్ మ్యాచ్‌లకు టీమిండియాకు నాయకత్వం వహించిన రోహిత్.. 12 మ్యాచ్‌లు గెలిచాడు, తొమ్మిది మ్యాచ్ లలో ఓడిపోగా.. మూడు టెస్ట్ మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.
రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడానికి ప్రధాన కారణాల్లో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో సఖ్యతలేకపోవటం ఒక కారణం కాగా.. రోహిత్ కొంతకాలంగా ఫామ్‌లో లేకపోవటం, అతని కెప్టెన్సీలో భారత్ వరుస ఓటములు ఎదుర్కోవటంతోపాటు రోహిత్ వయస్సు కూడా ఒక కారణంగా తెలుస్తోంది. రోహిత్ మైదానంలో చురుగ్గా కదలలేక పోతున్నాడన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో ముంబై జట్టు రోహిత్ శర్మను కేవలం బ్యాటింగ్ కోసం మాత్రమే ఇంపాక్ట్ ప్లేయర్‌గా వినియోగిస్తుంది.