KL Rahul: కేఎల్ రాహుల్‌ పై రవిశాస్త్రి ప్రశంసలు.. ఇంగ్లండ్‌లో రాణించే సత్తా ఉంది అంటూ కామెంట్స్..!

ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు భారత బ్యాటింగ్ లైనప్‌ను బలోపేతం చేయడానికి KS భరత్ స్థానంలో KL రాహుల్‌ (KL Rahul)ను జట్టులోకి తీసుకోవాలని భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు.

  • Written By:
  • Publish Date - March 19, 2023 / 12:30 PM IST

ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు భారత బ్యాటింగ్ లైనప్‌ను బలోపేతం చేయడానికి KS భరత్ స్థానంలో KL రాహుల్‌ (KL Rahul)ను జట్టులోకి తీసుకోవాలని భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. కేఎల్ రాహుల్ శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో అద్భుత హాఫ్ సెంచరీతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. దీంతో పాటు వికెట్ కీపింగ్ చేస్తూ అద్భుత క్యాచ్ కూడా అందుకున్నాడు.

ది ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగే WTC ఫైనల్‌కు రాహుల్ జట్టులోకి రావడాన్ని శాస్త్రి సమర్థించాడు. ముంబైలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి వన్డే సందర్భంగా శాస్త్రి వ్యాఖ్యానిస్తూ.. WTC ఫైనల్‌కు ముందు సెలెక్టర్లను ఇబ్బందుల్లో ఉంచడంలో రాహుల్ నిజంగా మంచి పని చేసాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు అతను సెలెక్టర్లను ఆకట్టుకున్నాడని అన్నాడు.

శాస్త్రి మాట్లాడుతూ.. రాహుల్ వికెట్ కీపింగ్ చేయగలిగితే భారత్ తన బ్యాటింగ్‌ను పటిష్టం చేసుకోగలదు. రాహుల్ ఇంగ్లండ్‌లో మిడిల్ ఆర్డర్‌లో ఐదో నంబర్ లేదా ఆరో నంబర్‌లో బ్యాటింగ్ చేయగలడు. ఇంగ్లండ్‌లో సాధారణంగా వికెట్‌కి వెనుక నుండి వికెట్ కీపింగ్ చేయాల్సి ఉంటుంది. ఐపీఎల్‌కు ముందు రాహుల్‌కి మరో రెండు వన్డేలు ఉన్నాయి. భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలడని రవిశాస్త్రి అన్నాడు.

ఆస్ట్రేలియాపై భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించడంలో రాహుల్ అద్భుతమైన 75* పరుగులు చేశాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 16/3,తరువాత 39/4 వద్ద ఉంది. అయితే రాహుల్ తన అజేయ ఇన్నింగ్స్‌లో 91 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌తో అజేయంగా నిలిచాడు. రవీంద్ర జడేజా (45 నాటౌట్)తో కలిసి ఆరో వికెట్‌కు 108 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అంతకుముందు ఆస్ట్రేలియాను భారత్ 188 పరుగులకే ఆలౌట్ చేసింది.

ODI సిరీస్‌కి ముందు ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో రాహుల్ నాగ్‌పూర్, ఢిల్లీలో జరిగిన మొదటి రెండు టెస్ట్‌లలో ఓపెనింగ్ చేశాడు. కానీ తక్కువ స్కోర్ కే అవుట్ అయ్యాడు. దీని వలన ఇండోర్, అహ్మదాబాద్‌లలో జరిగిన తర్వాతి రెండు టెస్ట్‌లకు రాహుల్ జట్టు నుండి తొలగించబడ్డాడు. అంతేకాకుండా టెస్ట్ తన వైస్ కెప్టెన్సీని కూడా కోల్పోయాడు.

రాహుల్ ఇప్పటివరకు 47 టెస్టుల్లో 33.44 సగటుతో 2642 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో రాహుల్ గత 10 ఇన్నింగ్స్‌ల్లో 125 పరుగులు చేయగలిగాడు. అదే సమయంలో కేఎస్ భరత్ నాలుగు టెస్టుల్లో 20.2 సగటుతో 101 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 44 పరుగులు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జూన్ 7-11 వరకు ఓవల్‌లో జరుగుతుంది. 2021లో సౌతాంప్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే.