Site icon HashtagU Telugu

Salman Bhutt : ప్రపంచ కప్, ఒలింపిక్స్‌లో కూడా పాక్‌తో ఆడ‌మ‌ని హామీ ఇవ్వాలి

Salman Bhutt

Salman Bhutt

Salman Bhutt : భారత్ – పాకిస్థాన్ క్రికెట్ సంబంధాలపై మరోసారి వివాదం చెలరేగింది. మొన్న (ఆదివారం) జరగాల్సిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌ (డ‌బ్ల్యూసీఎల్‌) లో భారత జట్టు పాకిస్థాన్‌తో తలపడాల్సి ఉంది. అయితే యువరాజ్ సింగ్ నాయకత్వంలోని ఇండియా ఛాంపియన్స్ జట్టు పాకిస్థాన్‌తో ఆడేందుకు నిరాకరించడంతో మ్యాచ్ రద్దయింది. ఈ సంఘటనతో ఇరు దేశాల మధ్య క్రీడా సంబంధాల భవిష్యత్తుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

సల్మాన్ భట్ విమర్శలు

భారత జట్టు బహిష్కరణపై పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ, “భారత్ నిజంగా పాకిస్థాన్‌తో ఆడే ఉద్దేశ్యం లేకపోతే, అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా ఇదే వైఖరిని చూపాలి. ఒకే సమయంలో ఐసీసీ టోర్నమెంట్లలో మాతో ఆడటం, ఇలాంటి ప్రైవేట్ ఈవెంట్లలో బహిష్కరించడం – ఇది ఏ విధమైన సందేశాన్ని పంపుతోంది?” అని ప్రశ్నించారు.

“ప్రపంచం మొత్తం ఈ విషయంపై మాట్లాడుతోంది. అభిమానులకు మీరు ఏం చూపించడానికి ప్రయత్నిస్తున్నారు? మీరు ఏమి నిరూపించాలనుకుంటున్నారు? మీరు నిజంగా పాకిస్థాన్‌తో ఆడకూడదనుకుంటే, ఐసీసీ టోర్నమెంట్లలోనూ ఆడకండి, ప్రపంచకప్‌లో ఆడకండి. ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ వేదికల్లో కూడా ఆడొద్దని వాగ్దానం చేయండి” అని భట్ వ్యాఖ్యానించారు.

‘ఈ నిర్ణయం ఎవరిది?’

భారత జట్టులో కొన్ని వ్యక్తుల నిర్ణయాల కారణంగానే బహిష్కరణ జరిగిందని భట్ ఆరోపించారు. “ఇది ఎవరి నిర్ణయం? కేవలం 4-5 మంది నిర్ణయం తీసుకోవడం వల్ల, ఆడేందుకు సిద్ధంగా ఉన్న మిగతావారు కూడా ఒత్తిడికి లోనయ్యారు. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమైన చర్య” అని భట్ మండిపడ్డాడు.

భారత్ – పాక్ క్రీడా సంబంధాలపై పెరుగుతున్న చర్చ

డ‌బ్ల్యూసీఎల్‌ మ్యాచ్ రద్దు కావడంతో భారత్ – పాకిస్థాన్ మధ్య క్రీడా సంబంధాల భవిష్యత్తుపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పటికే రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయిన పరిస్థితుల్లో, ఈ ఘటన రెండు దేశాల అభిమానుల మధ్య భిన్నాభిప్రాయాలను రేకెత్తించింది.

Krishna River : ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద.. 25 గేట్లు ఎత్తివేత