Site icon HashtagU Telugu

India Beats Pakistan: దెబ్బ అదుర్స్ కదూ… పాక్ ను చిత్తు చేసిన టీమిండియా

Indd Imresizer

Indd Imresizer

కలిసొచ్చిన టోర్నీలో టీమిండియా అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకుంది. భారీ అంచనాల మధ్య జరిగిన ఆసియాకప్ ఆరంభ మ్యాచ్ లో భారత్ పాకిస్థాన్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్ లో పాండ్యా , భువనేశ్వర్ చెలరేగితే.. బ్యాటింగ్ కోహ్లీ టచ్ లోకి వచ్చాడు. అటు పాండ్యా బ్యాట్ తోనూ రాణించి జట్టును గెలిపించాడు.
మొదట బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. 147 పరుగులకే దాయాది జట్టును ఆలౌట్ చేశారు. టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బరిలోకి దిగిన పాక్‌ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించినా ఈ సారి సక్సెస్ కాలేకపోయింది. ఆరంభంలోనే కెప్టెన్ బాబర్ ఆజామ్‌ను ఔట్ చేయడం ద్వారా భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ బ్రేక్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి పాక్ వికెట్లను భారత్ క్రమం తప్పకుండా పడగొట్టింది. ఫకర్ జమాన్ 10 పరుగులకు ఔటయ్యాడు. అయితే ఓపెనర్ రిజ్వాన్, ఇఫ్తికర్ అహ్మద్ పార్టనర్‌షిప్‌తో పాక్ కాస్త కోలుకుంది. రిజ్వాన్ 43 రన్స్ చేయగా… ఇఫ్తికర్ 28 పరుగులు చేశాడు. 14 ఓవర్ నుంచి హార్థిక్ పాండ్యా వరుసగా పాక్‌ను దెబ్బకొట్టాడు. కీలక వికెట్లతో పాక్ స్కోరుకు కళ్ళెం వేశాడు. అటు అర్షదీప్‌సింగ్ కూడా రాణించడంతో పాక్ వేగంగా పరుగులు చేయలేకపోయింది. చివర్లో పాక్ టెయిలెండర్లు రవూఫ్ 7 బంతుల్లో 13 , షాన్వాజ్ 6 బంతుల్లో 16 పరుగులు చేయడంతో పాక్ స్కోర్ 140 దాటింది. చివర్లో అర్షదీప్‌సింగ్ షాన్వాజ్‌ను ఔచ్చేయడంతో పాక్ ఇన్నింగ్స్‌కు 19.5 ఓవర్లలో 147 పరుగులకు తెరపడింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ 4 ఓవర్లలో 26 పరుగులకు 4 వికెట్లు పడగొట్టగా… పాండ్యా 25 రన్స్‌కు 3 వికెట్లు తీశాడు. అర్షదీప్‌కు 2 , అవేశ్ ఖాన్ 1 వికెట్ పడగొట్టారు.

 

Also Read: Liger in Asia Cup: భారత్, పాక్ మ్యాచ్ లో లైగర్

 

ఛేజింగ్ లో భారత్ కు తొలి బంతికే షాక్ తగిలింది. కేఎల్‌ రాహుల్‌ గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. పాకిస్తాన్ అరంగేట్ర బౌలర్ నసీమ్ షా వేసిన తొలి ఓవర్లోనే రాహుల్ వికెట్ల మీదకు ఆడుకొని క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఈ దశలో కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసాడు. ఫామ్ కోసం వేచిచూస్తున్న కోహ్లీ టచ్ లోకి వచ్చాడు. చూడచక్కని షాట్లతో అలరించాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 49 రన్స్ జోడించాడు. రోహిత్ 12 రన్స్ కు ఔటవగా.. కాసేపటికే కోహ్లీ 35 పరుగులకు వెనుదిరగడంతో టెన్షన్ పెరిగింది. సూర్యకుమార్ యాదవ్ ఔటయ్యాక భారత్ పై మరింత ఒత్తిడి పెరిగింది. ఈ దశలో రవీంద్ర జడేజా, హార్థిక్ పాండ్యా సమయోచితంగా ఆడారు. ఇద్దరూ సింగిల్స్ తీస్తూ రన్ రేట్ పడిపోకుండా చూశారు. చివరి మూడు ఓవర్లలో 32 పరుగులు చేయాల్సి ఉండగా.. భారీ షాట్లు కొట్టారు. ఒకసారి ఎల్బీడబ్ల్యూ ప్రమాదం నుంచి తప్పించుకున్న జడేజా
18 ఓవర్లో ఒక సిక్సర్ , ఫోర్ కొట్టాడు. చివరి రెండు ఓవర్లలో ఉత్కంఠ నెలకొన్నా 19వ ఓవర్ లో పాండ్యా 3 బౌండరీలు కొట్టడంతో భారత్ విజయం ఖాయమైంది. అయితే చివరి ఓవర్ తొలిబంతికి జడేజా ఔటవడంతో కాసేప్ టెన్షన్ వాతావరణం కనిపించింది. ఈ దశలో పాండ్యా సిక్సర్ తో మ్యాచ్ ను ముగించాడు. భారత్ 148 పరుగుల టార్గెట్ ను మరో రెండు బంతులు మిగిలిండగా ఛేదించింది. దీంతో గత టీ ట్వంటీ వరల్డ్ కప్ ఓటమికి టీమిండియా రివేంజ్ తీర్చుకున్నట్టైంది.

Exit mobile version