IND vs IRE: ఐర్లాండ్‌పై భారత్ ఘనవిజయం సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా

ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని టీమ్‌ఇండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో అజేయంగా నిలిచింది.

IND vs IRE: ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని టీమ్‌ఇండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో అజేయంగా నిలిచింది. భారత్ నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది.

186 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఐర్లాండ్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ప్రసిద్ధ కృష్ణ ఒకే ఓవర్‌లో కెప్టెన్ పాల్ స్టిర్లింగ్, లోర్కాన్ టక్కర్‌లను అవుట్ చేశాడు. స్టార్ బ్యాట్స్‌మెన్‌లిద్దరూ ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. దీని తర్వాత హ్యారీ టెక్టర్ కూడా కేవలం 7 పరుగులు చేసి ఔట్ కాగా, కర్టిస్ కాంఫర్ కూడా రవి బిష్ణోయ్ స్పిన్ ట్రాప్‌లో చిక్కుకున్నాడు. ఆండ్రూ బల్బిర్నీ ఒక్కడే భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. బల్బిర్నీ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 51 బంతుల్లో 72 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో అతను 5 ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదాడు. జస్ప్రీత్ బుమ్రా, కృష్ణ, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్ 18 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లోనూ తిలక్ వర్మ నిరాశపరిచాడు.తిలక్ వర్మ ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. సంజూ శాంసన్ రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి మూడో వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 26 బంతుల్లో 40 పరుగులు చేసి సంజూ ఔట్ కాగా, రుతురాజ్ గైక్వాడ్ అర్ధ సెంచరీ పూర్తి చేసి 58 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకున్నాడు. చివరి ఓవర్లో రింకూ సింగ్, శివమ్ దూబేలు బాధ్యతగా ఆడుతూ విధ్వంసం సృష్టించారు. రింకు 180 స్ట్రైక్ రేట్‌తో కేవలం 21 బంతుల్లో 38 పరుగులు చేయగా, దూబే 22 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రింకూ-శివం జోడీ చివరి రెండు ఓవర్లలో 42 పరుగులు చేయడంతో టీమిండియా 185 పరుగులు చేయగలిగింది.

Also Read: Gods Idol: దేవుడి విగ్రహాలు లేదా ఫోటోలను బహుమతిగా ఇవ్వవచ్చా.. ఇవ్వకూడదా?