Site icon HashtagU Telugu

T20 World Cup: మహిళల టీ ట్వంటీ వరల్డ్‌కప్‌.. భారత్‌కు రెండో విజయం

T20 Women

T20 Women

మహిళల టీ ట్వంటీ (Womens’ T20) ప్రపంచకప్‌లో భారత్ మరో విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన హర్మన్‌ప్రీత్‌ సేన ఇప్పుడు రెండో మ్యాచ్‌లో విండీస్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్ మహిళల జట్టును భారత్ 118 పరుగులకు కట్టడి చేసింది. ఓపెనర్ మాథ్యూస్ త్వరగానే ఔటైనప్పటకీ…టేలర్ , క్యాంప్‌బెల్లే రాణించడంతో కరేబియన్ టీమ్ కోలుకున్నట్టే కనిపించింది. ఈ దశలో భారత బౌలర్లు పుంజుకున్నారు. దీప్తి శర్మ వరుస వికెట్లతో విండీస్‌ను దెబ్బతీసింది. దీంతో భారీస్కోర్ సాధిస్తుందనుకున్న విండీస్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 4 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. రేణుకా సింగ్ 1, పూజా వస్త్రాకర్‌ 1 వికెట్ పడగొట్టారు.

ఛేజింగ్‌లో ఓపెనర్లు భారత్‌కు దూకుడుగానే ఆరంభాన్నిచ్చారు. స్మృతి మందాన , షెఫాలీ వర్మ తొలి వికెట్‌కు 3.3 ఓవర్లలో 32 పరుగులు జోడించారు. స్మృతి 10 పరుగులకు ఔటవగా.. షెఫాలీ వర్మ 5 ఫోర్లతో 28 పరుగులు చేసింది. పాక్‌పై హాఫ్ సెంచరీతో చెలరేగిన రోడ్రిగ్స్ 1 పరుగుకే ఔటవడంతో భారత్ 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్, వికెట్ కీపర్ రిఛా ఘోష్ ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 72 పరుగులు జోడించారు. హర్మన్‌ప్రీత్‌ 42 బంతుల్లో 3 ఫోర్లతో 33 పరుగులు చేయగా… దూకుడుగా ఆడిన రిఛా ఘోష్ 32 బంతుల్లోనే 5 ఫోర్లతో 44 పరుగులు చేసింది. వీరి జోరుతో భారత మహిళల జట్టు 18.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. తర్వాతి మ్యాచ్‌లో శనివారం భారత్ , ఇంగ్లాండ్‌తో తలపడుతుంది.