Site icon HashtagU Telugu

India T20: విండీస్ భయపెట్టినా భారత్ దే సిరీస్

Team India Practice

Team India Practice

వన్ సైడ్ గా సాగుతున్న భారత్, విండీస్ పోరుకు రెండో టీ ట్వంటీ ఒక్కసారిగా ఊపు తెచ్చింది. సీరీస్ చేజారిపోయే మ్యాచ్ కావడంతో విండీస్ చివరి వరకు పోరాడింది. మధ్యలో కొన్ని తప్పిదాలతో ప్రత్యర్థికి అవకాశం ఇచ్చిన భారత్ చివర్లో ఒత్తిడిని తట్టుకుని నిలబడి సిరీస్ విజయాన్ని అందుకుంది. నిజానికి ఈ మ్యాచ్ కూడా ఏక పక్షంగా ముగిసేదే. అయితే బౌలింగ్ , ఫీల్డింగ్ లలో టీమ్ ఇండియా చేసిన కొన్ని తప్పిదాలు మ్యాచ్ ను ఉత్కంఠగా మార్చేశాయి. చివర్లో సీనియర్ పేసర్ భువనేశ్వర్ అద్భుత ప్రదర్శన చేయకుంటే భారత్ ఓటమి పాలయ్యేది.

మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఈసారి ఓపెనర్లు శుభారంభం ఇవ్వలేకపోయారు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. అయితే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఫామ్ లో లేక నిరాశ పరుస్తున్న కోహ్లీ ఒకప్పటి విరాట్ ను గుర్తుకు తెస్తూ తనదైన షాట్లతో అలరించాడు. కోహ్లీ 52 రన్స్ కు ఔటవగా…తర్వాత రిషబ్ పంత్ , వెంకటేష్ అయ్యర్ ధాటిగా ఆడారు. పంత్ కేవలం 28 బంతుల్లో 52 రన్స్ చేశాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లుకు 187 పరుగులు చేసింది.

187 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన విండీస్ త్వరగానే ఓపెనర్లు వికెట్లు కోల్పోయింది. అయితే నికోలస్ పూరన్, పోవెల్ మూడో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. వీరిద్దరి జోరు చూస్తే విండీస్ విజయం ఖాయమని అనుకున్నారు. భారత్ పేలవ ఫీల్డింగ్ కారణంగా మ్యాచ్ చేజారిపోయేలా కనిపించింది. చివరి రెండు ఓవర్లలో విండీస్ 29 పరుగులు చేయాల్సి ఉండగా .. భువనేశ్వర్ అద్భుతమయిన బౌలింగ్ తో వారి జోరుకు బ్రేక్ వేశాడు. కేవలం 4 పరుగులు ఇచ్చి పూరన్ ను ఔట్ చేశాడు. చివరి ఓవర్లో పోవెల్ రెండు భారీ సిక్సర్లు కొట్టినా హర్శల్ పటేల్ కట్టడి చేసి జట్టుకు సిరీస్ విజయాన్ని అందించాడు. టీ20ల్లో భారత్‌కు ఇది 100వ విజయం. ఈ ఘనతను అందుకున్న రెండో జట్టుగా భారత్‌ రికార్డుకెక్కింది. పాకిస్థాన్ 118 విజయాలతో భారత్ కన్నా ముందుంది. సిరీస్ లో చివరి టీ ట్వంటీ ఆదివారం జరుగుతుంది.