India Beat SA: భారత్ ఆల్ రౌండ్ షో…సీరీస్ రోహిత్ సేనదే

టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు భారత్ మరో సీరీస్ విజయాన్ని అందుకుంది.

  • Written By:
  • Publish Date - October 2, 2022 / 11:17 PM IST

టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు భారత్ మరో సీరీస్ విజయాన్ని అందుకుంది. ఇటీవలే ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా తాజాగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ ట్వంటీ సీరీస్ నూ కైవసం చేసుకుంది. రెండో టీ ట్వంటీలో 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ 237 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత్ ఇన్నింగ్స్ లో సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ హైలైట్ గా చెప్పొచ్చు. ఓపెనర్లు రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.సఫారీ బౌలర్ల పై తొలి బంతి నుంచే విరుచుకుపడిన వీరిద్దరూ చెలరేగిపోయారు. తొలి వికెట్ కు 9.5 ఓవర్లలో 96 పరుగులు జోడించారు. రోహిత్ 37 బంతుల్లో 7 ఫోర్లు , 1 సిక్సర్ తో 43 , కే ఎల్ రాహుల్ 28 బంతుల్లో 5 ఫోర్లు , 4 సిక్సర్లతో 57 రన్స్ చేశారు.

వీరిద్దరూ ఔటయ్యాక కోహ్లీ , సూర్య కుమార్ అదే దూకుడు కొనసాగించారు. ఫామ్ లో ఉన్న సూర్య కుమార్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. అటు కోహ్లీ కూడా ధాటిగా ఆడడంతో స్కోర్ బోర్డు టాప్ గేర్ లో దూసుకెళ్లింది. కోహ్లీ , సూర్య జోరుకు సఫారీ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. సూర్య కుమార్ కేవలం 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా టీ ట్వంటీల్లో వేగంగా హాఫ్ సెంచరీ చేసిన మూడో భారత క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. సూర్య కుమార్ యాదవ్ 22 బంతుల్లో 5 ఫోర్లు , 5 సిక్సర్లతో 61 పరుగులకు ఔటయ్యాడు.
చివర్లో దినేష్ కార్తిక్ 7 బాల్స్ లో 2 సిక్సర్లతో 17 రన్స్ చేయదాంతో భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 237 పరుగులు చేసింది. కోహ్లీ 7 ఫోర్లు , 1 సిక్సర్ తో 49 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు.
239 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా కేవలం ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయింది. ప్రోటీస్‌ ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ వేసిన ఆర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో టెంబా బావుమా, రుసో డకౌట్‌గా వెనుదిరిగారు. తర్వాత మకరమ్ 33 రన్స్ కు ఔటవగా సఫారీ టీమ్ మూడో వికెట్ చేజార్చుకుంది. అయితే సౌతాఫ్రికా చివరి వరకూ పోటీ ఇచ్చిందంటే కారణం డికాక్, మిల్లర్ వల్లనే. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 170 కి పైగా భాగస్వామ్యం నెలకొల్పారు. ముఖ్యంగా డేవిడ్ మిల్లర్ సెంచరీతో రెచ్చిపోయాడు. అయితే అతని మెరుపులు సఫారీ టీమ్ ను గెలిపించలేక పోయాయి. దీంతో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 221 పరుగులు చేయగలిగింది. మిల్లర్ 46 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. చివరి ఓవర్లో గెలుపు కోసమో 37 రన్స్ చేయాల్సి ఉండగా…ఆ జట్టు 20 రన్స్ చేసింది. దీంతో భారత్ 2-0 తో సీరీస్ కైవసం చేసుకుంది. డికాక్ 69 రన్స్ తో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 62 రన్స్ ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. సీరీస్ లో చివరి మ్యాచ్ బుధవారం ఇండోర్ లో జరుగుతుంది.