India Beat SA: యువ పేసర్ల జోరు…సఫారీల బేజారు

సౌతాఫ్రికాతో ఆరంభమైన మూడు టీ ట్వంటీల సీరీస్ లో భారత్ శుభారంభం చేసింది.

  • Written By:
  • Publish Date - September 28, 2022 / 10:16 PM IST

సౌతాఫ్రికాతో ఆరంభమైన మూడు టీ ట్వంటీల సీరీస్ లో భారత్ శుభారంభం చేసింది. తిరువనంతపురం వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్ లో పేసర్లు చెలరేగితే…బ్యాటింగ్ లో కే ఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్ రాణించారు. సఫారీ టీమ్ ఏ దశలోనూ పెద్దగా పోటీ ఇవ్వలేక పోయింది. ఈ మ్యాచ్ లో భారత యువ పేసర్లు చెలరేగిపోయారు. సఫారీ బ్యాటర్లను తమ పేస్ తో బెంబేలెత్తించారు. ఫలితంగా దక్షిణాఫ్రికా
106 పరుగులకు పరిమితమయింది. ఒక దశలో కనీసం 50 పరుగులైనా చేస్తుందా అనిపించింది. ఎందుకంటే భారత్ బౌలర్లు ఓ రేంజ్ లో ఆ జట్టు బ్యాటింగ్ ను దెబ్బ తీశారు. అర్ష్ దీప్ , దీపక్ చాహర్ ధాటికి సౌతాఫ్రికా కేవలం 2.3 ఓవర్లలో 9 రన్స్ కే సగం వికెట్లు కోల్పోయింది. ఈ అయిదు వికెట్లలో నలుగురు డకౌట్ అయ్యారు.
తొలి ఓవర్‌ చివరి బంతికే సౌతాఫ్రికా కెప్టెన్‌ బవుమాను ఔట్‌ చేసి దీపక్‌ చహర్‌ శుభారంభం అందించాడు. ఇక రెండో ఓవర్లో అర్ష్‌దీప్‌ సింగ్ చెలరేగిపోయాడు.

ఆ ఓవర్లో రెండు, ఐదు, ఆరు బంతులకు ముగ్గురు సఫారీ బ్యాటర్లను ఔట్‌ చేశాడు. అతని దెబ్బకు డికాక్‌ , రూసో , మిల్లర్‌ ఔటయ్యారు. ఆ తర్వాతి ఓవర్లో చహర్‌.. స్టబ్స్‌ ను కూడా ఔట్‌ చేయడంతో సౌతాఫ్రికా 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మక్రమ్ 25, పార్నెల్ 24 రన్స్ తో ఆదుకున్నారు. తర్వాత కేశవ్ మహారాజ్ 41 రన్స్ చేయడంతో స్కోరు 100 దాటింది. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 3 , దీపక్ చహార్ 2 , హర్షల్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు.

107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రబడా బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. కాసేపటికే కోహ్లీ కూడా ఔటవడంతో భారత్ 17 రన్స్ కే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మరో ఓపెనర్ కే ఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్ సఫారీ బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా అదరగొట్టారు. భారీ షాట్లతో అలరించారు. వీరిద్దరూ మూడో వికెట్ కు అజేయంగా 90 పరుగులు జోడించారు. దీంతో భారత్ 16.4 ఓవర్లలోనే టార్గెట్ చేదించింది. రాహుల్ 51 , సూర్య కుమార్ యాదవ్ 50 రన్స్ తో అజేయంగా నిలిచారు. చివర్లో రాహుల్ సిక్స్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని జట్టుకు విజయాన్ని అందించారు.
ఈ విజయంతో మూడు మ్యాచ్ ల సీరీస్ లో టీమిండియా 1-0 తో ఆధిక్యంలో నిలిచింది. సీరీస్ లో రెండో మ్యాచ్ గౌహతి వేదికగా ఆదివారం జరుగుతుంది.