Site icon HashtagU Telugu

India Vs SL: సూర్యకుమార్ మెరుపులు… టీమిండియాదే సిరీస్‌

India

Ind

India vs Srilanka: శ్రీలంకతో జరిగిన టీ ట్వంటీ సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. రాజ్‌కోట్ వేదికగా అన్ని విభాగాల్లోనూ అదరగొట్టిన టీమిండియా 91 పరుగుల తేడాతో లంకను చిత్తు చేసింది. గత మ్యాచ్ తప్పిదాలను రిపీట్ కానివ్వకుండా పూర్తి డామినేశషన్ కనబరిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. ఆరంభంలోనే ఇషాన్ కిషన్ ఔటైనప్పటకీ..శుభ్‌మన్ గిల్, త్రిపాఠి ధాటిగా ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 49 పరుగులు జోడించారు. త్రిపాఠీ 35 రన్స్‌కు ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రతి ఒక్కరి బౌలింగ్‌లో ఫోర్లు, సిక్సర్లు బాదుతూ పరుగుల ప్రవాహం సృష్టించాడు. గిల్ అతడికి సహకరించడంతో వీరిద్దరూ వంద పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గిల్ ఔటైన తర్వాత భారత్ వరుసగా పాండ్యా, హుడా , వికెట్లను కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడినా సూర్య జోరు తగ్గలేదు. భారీ షాట్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. పొట్టి ఫార్మాట్‌లో ఓవరాల్‌గా అతనికిది నాలుగో శతకం. చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్ పటేల్ కూడా వరుసగా బౌండరీలు బాదుతూ స్కోరు వేగాన్ని పెంచాడు. 9 బంతుల్లో 21 పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లలో మధుశంకా 2 వికెట్లు తీయగా.. రజితా, కరుణరత్నే, హసరంగా తలో వికెట్ పడగొట్టారు.

229 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంకకు శుభారంభం దక్కినప్పటికీ భారత బౌలర్లు పవర్ ప్లే చివర్లో కళ్ళెం వేశారు. ధాటిగా ఆడే క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోయింది. శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ మెండీస్, కెప్టెన్ దసున్ శనకా మినహా మిగిలినవారు పెద్దగా రాణించలేదు. భారత బౌలర్ల ధాటికి ప్రత్యర్థి బ్యాటర్లు పెవిలియన్‌కు వరుసగా క్యూ కట్టారు. గట్టి భాగస్వామ్యం ఒక్కటి కూడా ఏర్పరచకుండానే లంక బ్యాటర్లను వెనక్కి పంపారు. ఫలితంగా శ్రీలంక జట్టు 16.4 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. గత మ్యాచ్‌లో నోబాల్స్ వేసి విమర్శలు ఎదుర్కొన్న అర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్‌లో మాత్రం రాణించాడు. 2.4 ఓవర్లలో 20 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు.భారత బౌలర్లలో అర్షదీప్‌సింగ్3 , హార్థిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్, చాహల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో మూడు టీ ట్వంటీల సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. తొలి టీ ట్వంటీలో భారత్ గెలిస్తే.. రెండో మ్యాచ్‌లో లంక విజయం సాధించింది. ఇక రెండు జట్ల మధ్య వన్డే సిరీస్ మంగళవారం నుంచి ఆరంభం కానుంది.