India Beat SL: అదరగొట్టిన శివమ్ మావి తొలి టీ ట్వంటీ భారత్‌దే

చివరి బంతికి ఫోర్ కొట్టాల్సిన సమయంలో కరుణరత్నే సింగిల్ మాత్రమే తీయడంతో భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.

  • Written By:
  • Updated On - January 3, 2023 / 10:53 PM IST

టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్, శివమ్ మావి అంతర్జాతీయ టీ ట్వంటీ అరంగేట్రం చేశారు. పవర్ ప్లేలో భారీస్కోర్ చేస్తారనుకున్న ఓపెనర్లలో గిల్ నిరాశపరిచాడు. కేవలం 7 పరుగులకే వెనుదిరిగాడు. కాసేపటికే సూర్యకుమార్ యాదవ్ 7, సంజూ శాంసన్ 5 పరుగులకే ఔటవడంతో భారత్ మూడు వికెట్లు కోల్పోయింది.

ఫామ్‌లో ఉన్న ఓపెనర్ ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడాడు. 29 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ ఔటైన తర్వాత భారత్ తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. ఈ దశలో హార్థిక్ పాండ్యా దూకుడుగా ఆడాడు. 27 బంతుల్లో 4 ఫోర్లతో 29 రన్స్‌ చేశాడు. చివర్లో దీపక్ హుడా, అక్షర్ పటేల్ మెరుపులు మెరిపించారు. లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగిన వీరిద్దరూ భారీ షాట్లతో అలరించారు. దీపక్ హుడా 23బంతుల్లోనే 4 సిక్సర్లు, 1 ఫోర్‌తో 41 పరుగులు చేయగా.. అక్షర్ పటేల్ 20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 31 రన్స్ చేశాడు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. ఆరో వికెట్‌కు హుడా, అక్షర్ పటేల్ 5.5 ఓవర్లలో68 పరుగులు జోడించడంతో భారత్ మంచి స్కోర్ చేయగలిగింది.

ఛేజింగ్‌లో శ్రీలంక ఆరంభం నుంచీ తడబడినా ధాటిగా ఆడింది. కుశాల్ మెండిస్ 28 పరుగులకు ఔటవగా.. టాపార్డర్‌లో మిగిలిన బ్యాటర్లు నిరాశపరిచారు. అయితే కెప్టెన్ శనక , హసరంగ ధాటిగా ఆడడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. శనక కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 27 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 45 రన్స్ చేశాడు. హసరంగా 10 బంతుల్లోనే 2 సిక్సర్లు, 1 ఫోర్‌తో 21 రన్స్ చేయగా.. చివర్లో వీరిద్దరినీ భారత బౌలర్లు వెంటవెంటనే ఔట్ చేశారు. క్రీజులో వీరిద్దరూ ఉన్నంతసేపూ భారత అభిమానుల్లో టెన్షన్ నెలకొంది.

మంచు ప్రభావం కూడా ఉండడంతో ఫీల్డింగ్‌ చేయడం ఇబ్బందిగా మారింది. కాగా కరుణారత్నే భారీ షాట్లతో లంకను గెలిపించేందుకు ప్రయత్నించినా చివరి ఓవర్లో అక్షర్ పటేల్ కట్టడి చేశాడు. చివరి ఓవర్‌లో 13 పరుగులు చేయాల్సి ఉండగా..మొదటి మూడు బంతులకు రెండు పరుగులు రాగ… తర్వాత కరుణారత్నే సిక్సర్ కొట్టాడు. అయితే నాలుగో బంతికి అక్షర్ పటేల్ పరుగులు ఏమీ ఇవ్వకపోగా.. ఐదో బంతికి రజిత రనౌటయ్యాడు. ఇక చివరి బంతికి ఫోర్ కొట్టాల్సి ఉండగా.. కరుణారత్నే సింగిల్‌ మాత్రమే తీయగలగడంతో భారత్ 2 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన శివమ్ మావి అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చిన 4 వికెట్లతో అదరగొట్టాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌లో రెండో మ్యాచ్‌ గురువారం పుణేలో జరుగుతుంది.