Women Cricket – Gold : మహిళా క్రికెట్ లో ఇండియాకు గోల్డ్.. ఆసియా గేమ్స్ లో దూకుడు

Women Cricket - Gold : చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు సత్తా చాటింది.

  • Written By:
  • Publish Date - September 25, 2023 / 03:41 PM IST

Women Cricket – Gold : చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు సత్తా చాటింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్ లో గెలిచి  స్వర్ణం గెలుచుకుంది. ఆసియా గేమ్స్‌‌లో క్రికెట్  ఆడటం భారత్‌కు ఇదే తొలిసారి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 116 రన్స్ చేసింది.  అనంతరం 117 పరుగుల టార్గెట్ ను ఛేదించేందుకు బరిలోకి దిగిన లంక  20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 97 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 19 పరుగుల తేడాతో గెలిచి భారత్ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.

Also read : War of Governor and CM : సీన్ మారిందా? మార్చారా? మ‌ళ్లీ సీఎంవో, గ‌వ‌ర్న‌ర్ ఢీ!

టిటాస్ సాధు స్పిన్ మ్యాజిక్

భారత స్పిన్నర్ టిటాస్ సాధు లంకను కోలుకోలేని దెబ్బకొట్టింది.  వరుస ఓవర్లలో వికెట్లు పడగొట్టి లంకను కోలుకోలేకుండా చేసింది. మూడో ఓవర్ వేసిన సాధు.. తొలి బంతికే లంక బ్యాట్స్ వుమెన్ సంజీవనిని  ఔట్ చేసింది. ఇదే ఓవర్లో  నాలుగో బంతికి  విష్మి గుణరత్నె (0) ను బౌల్డ్ చేసింది. ఐదో ఓవర్‌లో సాధు.. లంక కెప్టెన్ ఆటపట్టు పని పట్టింది. సాధు వేసిన రెండో బంతిని ఆటపట్టు కొట్టగా.. అది దీప్తి శర్మ‌కు క్యాచ్ గా చిక్కింది. ఈ ఓవర్‌లో  జెమీమా క్యాచ్ మిస్ చేయకుంటే .. నీలాక్షి డిసిల్వ వికెట్ కూడా అప్పుడే పడిపోయి ఉండేది. తొలి ఓవర్లో 12 పరుగులు చేసి దూకుడుగా కనిపించిన లంక.. ఐదు ఓవర్లు గడిచే సరికి మూడు వికెట్లు కోల్పోయి 15 పరుగులకే పరిమితం కావడాన్ని బట్టి భారత బౌలింగ్ ఏ రేంజ్ లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.

హాసిని పెరెరా ఊపు

ఈ తరుణంలో సాధు బౌలింగ్ జోరుతో  వేగం తగ్గిన  లంక స్కోరుబోర్డుకు హాసిని పెరెరా ఊపు తెచ్చింది.  పూజా వస్త్రకార్ వేసిన  ఆరో ఓవర్లో  ఆమె మూడు ఫోర్లు కొట్టింది. నీలాక్షి డిసిల్వా కూడా కుదరుకున్నట్టే అనిపించింది.   పది ఓవర్లు ముగిసే సమయానికి లంక  నాలుగు వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత  కూడా లంక బ్యాటర్లను భారత స్పిన్నర్లు కట్టడి చేశారు. దీంతో లంక టీమ్ సాధించాల్సిన  నెట్ రన్ రేట్ పెరిగిపోయింది. 34 బంతులలో 23 పరుగులు చేసి లంక క్యాంప్‌లో ఆశలు నింపిన నీలాక్షి డిసిల్వను వస్త్రకార్ 17వ ఓవర్లో పెవిలియన్ కు పంపించింది. ఆ ఓవర్లో తొలి బంతికే ఆమె బౌల్డ్ అయింది. దీప్తి వేసిన  18వ ఓవర్లో రణసింగె (26 బంతుల్లో 19, 2 ఫోర్లు) కూడా నిష్క్రమించడంతో విజయంపై లంక ఆశలు వదులుకుంది.