Site icon HashtagU Telugu

Ind Beats HK: హంకాంగ్‌పై విజయంతో సూపర్‌ 4కు భారత్‌

Virat Suryakumar

Virat Suryakumar

ఆసియాకప్‌లో టీమిండియా సూపర్‌ 4 కు దూసుకెళ్ళింది. హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ చెలరేగితే… బౌలింగ్‌లో సమిష్టిగా రాణించారు.
మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు ఓ మోస్తారు ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ 38 రన్స్ జోడించారు. అయితే వీరిద్దరూ ఔటయ్యాక.. కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టారు. చాలా కాలంగా ఫామ్‌లో లేని కోహ్లీ ధాటిగా ఆడాడు. పూర్తి ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. హాఫ్ సెంచరీతో కాన్ఫిడెన్స్ పెంచుకున్న విరాట్‌ 59 పరుగులు చేశాడు. అయితే భారత్ ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగే హైలెట్‌గా చెప్పాలి. ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్యకుమార్ సిక్సర్ల వర్షం కురిపించాడు.

హాంకాంగ్ బౌలర్లపై విరుచుకుపడిన సూర్య కేవలం 26 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. హరూన్‌ రషీద్‌ వేసిన ఆఖరి ఓవర్లో సూర్య పూనకం వచ్చినట్లు ఊగిపోయి ఏకంగా నాలుగు సిక్సర్లు బాదాడు. సూర్య.. తన హాఫ్‌ సెంచరీని కేవలం 22 బంతుల్లోనే పూర్తి చేశాడంటే, అతని విధ్వంసం ఏ స్థాయిలో ఉండిందో అర్ధమవుతుంది. మరో ఎండ్‌లో కోహ్లి కూడా బాధ్యతాయుతంగా ఆడి టీ20ల్లో 31వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. కోహ్లీ 44 బంతుల్లో 1 ఫోర్ , 3 సిక్సర్లు ఉన్నాయి. ఒక దశలో 15 ఓవర్లకు భారత్ 114 పరుగులు చేయడంతో స్కోర్ 160 చేరుతుందనిపించింది. అయితే సూర్యకుమార్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారత్ చివరి ఐదు ఓవర్లలో 78 పరుగులు చేసింది.

ఛేజింగ్‌లో హాంకాంగ్ ధాటిగా ఆడేందుకు ప్రయత్నించినా వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు త్వరగానే ఔటవగా.. బాబర్ హయత్, కించిత్ షా రాణించారు. బాబర్ 41 , కించిత్ 30 పరుగులు చేసి ఔటయ్యారు. తర్వాత అజీజ్‌ ఖాన్ 14 పరుగులకు ఔటవదగా… చివర్లో జీసన్ అలీ, వికెట్ కీపర్ స్కాట్ ధాటిగా ఆడినా సాధించాల్సిన రన్‌రేట్ భారీగా ఉండడంతో పరుగుల అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగారు. వీరిద్దరూ భారత బౌలర్లపై ఎటాకింగ్ బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నారు. చివరికి హాంకాంగ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 152 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో భువనేశ్వర్, అర్షదీప్‌సింగ్, జడేజా , అవేశ్ ఖాన్, ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో భారత్ సూపర్ 4 స్టేజ్‌లో అడుగుపెట్టింది. భారత తుది జట్టులో మార్పు జరిగింది. ఎవరూ ఊహించని విధంగా ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యాకు రెస్ట్ ఇచ్చింది. అతని స్థానంలో రిషబ్ పంత్‌కు చోటు కల్పించింది.