Site icon HashtagU Telugu

India Beat Bangladesh: టీ ట్వంటీ ప్రపంచకప్ సెమీస్‌కు చేరువైన భారత్

team india

team india

టీ ట్వంటీ ప్రపంచకప్‌ సెమీఫైనల్ రేస్ ఆసక్తికరంగా సాగుతోంది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్ బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ మలుపులు తిరుగుతూ సాగింది. బంగ్లా బ్యాటర్లు చివరి వరకూ టెన్షన్ పెట్టినా టీమిండియానే గెలిచింది. ఈ విజయంతో భారత్ సెమీస్‌కు చేరువైంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా భారీస్కోర్ చేసింది. 185 పరుగుల టార్గెట్‌ను బంగ్లాదేశ్ ముందుంచింది. కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశపరిచినా… మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ ఫామ్‌లోకి వచ్చాడు. కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కు 67 పరుగులు జోడించాడు. గత మ్యాచ్‌లలో పూర్తిగా విఫలమైన రాహుల్ బంగ్లాపై మాత్రం దూకుడు ఆడి 32 బంతుల్లోనే 4 సిక్సర్లు, 3 ఫోర్లతో 50 రన్స్ చేశాడు. అటు విరాట్ కోహ్లీ కూడా తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ మరో హాఫ్ సెంచరీ సాధించాడు. సూర్యకుమార్ యాదవ్ 16 బంతుల్లో 30 , కోహ్లీ 44 బంతుల్లోనే 64 పరుగులు చేశాడు.

భారత్ అవకాశాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఆడిన బంగ్లాదేశ్ పవర్ ప్లేలో రెచ్చిపోయింది. ఓపెనర్లు లిట్టన్ దాస్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. వర్షాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా ఆడిన లిట్టన్ దాస్ భారీ షాట్లతో రెచ్చిపోయాడు. అయితే వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి బంగ్లాదేశ్ 7 ఓవర్లలో 66 పరుగులు చేసింది. ఆ సమయానికి బంగ్లా డక్‌వర్త్ లూయీస్ ప్రకారం 17 పరుగులే ఎక్కువ స్కోరే చేసింది. తర్వాత వర్షం తగ్గడం మ్యాచ్ తిరిగి ఆరంభమైంది. బంగ్లాదేశ్ 16 ఓవర్లలో 151 పరుగులుగా టార్గెట్ నిర్ణయించారు. తర్వాత భారత బౌలర్లు బంగ్లా జోరుకు బ్రేక్ వేశారు. అయితే వికెట్లు కోల్పోతున్నా బంగ్లా బ్యాటర్లు చివరి వరకూ పోరాడారు. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. చివరి ఓవర్‌ను అర్షదీప్‌సింగ్‌ అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టును గెలిపించాడు. ఈ విజయంతో భారత్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు చేరుకుని సెమీస్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది.