India Beat Australia: లెక్క సరిచేసిన టీమిండియా

నాగ్ పూర్ టీ ట్వంటీలో భారత్ దే పైచేయిగా నిలిచింది. సిరీస్ చేజారకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

  • Written By:
  • Updated On - September 23, 2022 / 11:14 PM IST

నాగ్ పూర్ టీ ట్వంటీలో భారత్ దే పైచేయిగా నిలిచింది. సిరీస్ చేజారకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వరుణుడు అడ్డుపడిన ఈ మ్యాచ్ లో బ్యాటర్లు మెరుపులతో అభిమానులకు మంచి ఎంటర్ టైన్ మెంట్ దక్కింది. 8 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. జట్టులోకి బూమ్రా తిరిగి రావడంతో ఉమేశ్ యాదవ్ పై వేటు పడింది.

అలాగే భారీగా పరుగులిస్తున్న భువిని తప్పించిన భారత్ రిషబ్ పంత్ ను జట్టులోకి తీసుకుంది. తడిసిన పిచ్ పై భారీస్కోర్ కష్టమనుకున్న వేళ ఆస్ట్రేలియా దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అక్షర్ పటేల్ స్పిన్ కు ఆసీస్ తడబడింది. రెండో ఓవర్లోనే గ్రీన్, కాసేపటికే మాక్స్ వెల్ ఔటవడంతో ఆసీస్ కష్టాల్లో పడినట్టు కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఫించ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. వరుస వికెట్లు పడుతున్నా భారీ షాట్లతో అలరించారు. ఫించ్ 15 బంతుల్లో 4 ఫోర్లు ఓ సిక్సర్‌తో 31 రన్స్ కు ఔటవగా.. తర్వాత మాథ్యూ వేడ్ దూకుడు కొనసాగించాడు. గత కొంత కాలంగా ఆసీస్ కు ఫినిషింగ్ లో అదరగొడుతున్న వేడ్ మరోసారి తన సత్తా చాటాడు. హర్షల్ పటేల్ వేసిన రెండు ఓవర్లలో రెచ్చిపోయాడు. ముఖ్యంగా హర్షల్ వేసిన చివరి ఓవర్లో మూడు సిక్సర్లు బాదేశాడు.

ఆస్ట్రేలియా నిర్ణీత 8 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. వేడ్ కేవలం 20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. హర్షల్ పటేల్ 2 ఓవర్లలో 32 పరుగులు సమర్పించుకున్నాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 2, బూమ్రా 1 వికెట్ తీసుకున్నారు.

91 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ కు మెరుపు ఆరంభం దక్కింది. పవర్ ప్లే 2 ఓవర్లలో రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. ఫలితంగా తొలి వికెట్ కు ఓపెవర్లు రాహుల్, రోహిత్ 2.5 ఓవర్లలో 39 పరుగులు జోడించారు. రాహుల్ 10 రన్స్ కు ఔటవగా.. తర్వాత కోహ్లీ, రోహిత్ ఇన్నింగ్స్ కొనసాగించారు. ముఖ్యంగా హిట్ మ్యాన్ రోహిత్ భారీ సిక్సర్లతో అభిమానులను అలరించాడు. అటు కోహ్లీ , సూర్యకుమార్ యాదవ్ వరుస బంతుల్లో వెనుదిరగడంతో చివర్లో టెన్షన్ నెలకొంది. కోహ్లీ 11 రన్స్ కు ఔటవగా..సూర్యకుమార్ డకౌటయ్యాడు. ఈ రెండు వికెట్లూ ఆడమ్ జంపాకే దక్కాయి. ఈ దశలో రోహిత్ దూకుడుగా ఆడాడు. సీన్ ఎబోట్ వేసిన ఆరో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన రోహిత్ 11 పరుగులు రాబట్టాడు. అయితే ఏడో ఓవర్లో హార్థిక్ పాండ్యా ఔటవడంతో భారత్ 4వ వికెట్ కోల్పోయింది. దీంతో చివరి ఓవర్లో విజయం కోసం 9 పరుగులు చేయాల్సి ఉంది. ఈ దశలో రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్ జట్టు విజయాన్ని పూర్తి చేశారు. రోహిత్ కేవలం 20 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దినేశ్ కార్తీక్ చివరి ఓవర్ తొలి రెండు బంతులను సిక్సర్, ఫోర్ గా మలచడంతో భారత్ మరో 4 బాల్స్ మిగిలుండగానే గెలిచింది. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల సిరీస్ ను రోహిత్ సేన 1-1తో సమం చేసింది. సిరీస్ ను డిసైడ్ చేసే చివరి మ్యాచ్ హైదరాబాద్ వేదికగా ఆదివారం జరుగుతుంది.