1st ODI: రాణించిన రాహుల్, జడేజా… తొలి వన్డేలో భారత్ విజయం

వన్డే సిరీస్ కు అదిరిపోయే ఆరంభం..లో స్కోరింగ్ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది.

  • Written By:
  • Updated On - March 17, 2023 / 08:48 PM IST

India vs Australia 1st ODI: వన్డే సిరీస్ కు అదిరిపోయే ఆరంభం..లో స్కోరింగ్ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. బౌలింగ్ లో షమి, సిరాజ్ , జడేజా అదరగొడితే…బ్యాటింగ్ లో కే ఎల్ రాహుల్ కీలక ఇనింగ్స్ తో జట్టును గెలిపించాడు. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండో ఓవర్లోనే ఓపెనర్ ట్రావిస్ హెడ్ వికెట్ తీసినా..మరో ఓపెనర్ మిచెల్ మార్ష్, కెప్టెన్ స్టీవ్ స్మిత్ మంచి పార్టనర్ షిప్ నెలకొల్పారు. రెండో వికెట్ కు 72 పరుగులు జోడించారు. ముఖ్యంగా మార్ష్ భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. అయితే మార్ష్ ను జడేజా ఔట్ చేసి భారత్ కు బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. 169 రన్స్ దగ్గర ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత మరో 19 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లనూ పారేసుకుంది. మిచెల్ మార్ష్ 65 బంతుల్లోనే 81 పరుగులు చేయడంతో ఒక దశలో 300కుపైగా స్కోరు సులువుగా చేస్తుందని భావించినా.. కేవలం 19 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు కోల్పోయింది. దీంతో ఆసీస్ ఇన్నింగ్స్ 188 రన్స్ దగ్గర ముగిసింది. భారత బౌలర్లలో మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్ మూడేసి వికెట్లతో చెలరేగారు.

189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. మిచెల్ స్టార్క్ దెబ్బకు16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇషాన్‌ కిషన్‌ స్టోయినిస్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరగ్గా.. విరాట్‌ కోహ్లి నాలుగు పరుగుల వద్ద స్టార్క్‌ బౌలింగ్‌లో ఎల్బీ అయ్యాడు. ఆ తర్వాత మరుసటి బంతికే ఎల్బీ రూపంలో సూర్యకుమార్‌ గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత పాండ్యా, రాహుల్‌ నిలకడ ఆడటంతో వికెట్ల పతనం ఆగింది.
ఇన్నింగ్స్‌ గాడిన పడిందనుకున్న దశలో 25 పరుగులకి పాండ్యా ఔటయ్యాడు. ఈ దశలో కే ఎల్ రాహుల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న రాహుల్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఆల్ రౌండర్ జడేజాతో కలిసి ఆరో వికెట్ కు సెంచరీ పార్టనర్ షిప్ నెలకొల్పాడు. దీంతో భారత్ 39.5 ఓవర్లలో టార్గెట్ అందుకుంది. కే ఎల్ రాహుల్ 7 ఫోర్లు , 1 సిక్స్ తో 75 , జడేజా 45 రన్స్ తో అజేయంగా నిలిచారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే విశాఖలో ఆదివారం జరుగుతుంది.