Site icon HashtagU Telugu

T20: సూర్య కెప్టెన్ ఇన్నింగ్స్-రింకూ ఫినిషింగ్ టచ్.. భారత్ దే తొలి టీ ట్వంటీ

Team India

Surya Kumar India

T20 India vs Australia: వరల్డ్ కప్ పరాజయం తర్వాత జరుగుతున్న తొలి సిరీస్ లో భారత్ బోణీ కొట్టింది.విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ , ఇషన్ కిషన్ హాఫ్ సెంచరీకి తోడు రింకూ సింగ్ ఫినిషింగ్ టచ్ భారత్ కి విజయాన్ని అందించాయి.

మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో జోష్‌ ఇంగ్లీష్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 50 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 110 పరుగులు చేశాడు. అతడితో పాటు స్టీవ్‌ స్మిత్‌ 52 పరుగులతో రాణించాడు. భారత్ బౌలర్లు అనుకున్న స్థాయిలో రాణించలేక పోయారు. బిష్ణోయ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

విశాఖ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండే వికెట్ కావడంతో భారత్ కూడా ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే 22 రన్స్ కే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడారు. వీరిద్దరూ 12 ఓవర్లలోనే 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇషాన్ కిషన్ 58 రన్స్ కు వెనుదిరిగినా…సూర్య కుమార్ మాత్రం తన జోరు కొనసాగించాడు. వన్డే ప్రపంచ కప్ లో నిరాశ పరిచిన స్కై పొట్టి క్రికెట్ లో తన మెరుపులు చూపించాడు. 154 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది.

కాసేపటికే సూర్య కుమార్ కూడా కేవలం 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 80 పరుగులు చేసి ఔట్ అయ్యాడు . విజయానికి మరో 15 పరుగులు అవసరమైన సమయంలో సూర్యకుమార్‌ వికెట్‌ను టీమిండియా కోల్పోయింది. చివర్లో వరుస వికెట్లు కోల్పోవడం కాస్త టెన్షన్ పెట్టింది. ఈ పరిస్థితుల్లో రింకూ సింగ్ మెరుపులు ఆకట్టుకున్నాయి. చివరి బంతికి సిక్సర్ కొట్టి మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. దీంతో భారత్ 209 పరుగుల భారీ లక్ష్యాన్ని 19. 5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి టీమిండియా ఛేదించింది.

Exit mobile version