Team India: తొలి వన్డేలో భారత్ ఆటగాళ్ళ రికార్డుల మోత

కరేబియన్ టూర్ లో భారత్ శుభారంభం చేసింది. తొలి వన్డేలో గెలిచి సీరీస్ లో ఆధిక్యాన్ని అందుకుంది.

  • Written By:
  • Publish Date - July 23, 2022 / 02:31 PM IST

కరేబియన్ టూర్ లో భారత్ శుభారంభం చేసింది. తొలి వన్డేలో గెలిచి సీరీస్ లో ఆధిక్యాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో ధావన్ తో పాటు గిల్ , అయ్యర్ ఫామ్ లోకి వచ్చారు. ఈ క్రమంలో పలు రికార్డులు అందుకున్నారు. ధావన్‌ ఈ మ్యాచ్‌లో 97 పరుగులకే ఔటవ్వడం నిరాశ పరిచినా రికార్డుల మోత మోగించాడు.
అతి పెద్ద వయసులో వన్డేల్లో హాఫ్ సెంచరీ చేసిన భారత కెప్టెన్‌గా సరికొత్త రికార్డు సాధించాడు. ఇంతకుముందు 1999లో కెప్టెన్‌గా చివరి హాఫ్ సెంచరీ చేసినప్పుడు మహ్మద్ అజారుద్దీన్ వయసు 36 ఏళ్ల 120 రోజులు. ప్రస్తుతం ధావన్ వయసు 36 ఏళ్ల 229 రోజులు. వెస్టిండీస్‌ గడ్డపై అత్యధిక వన్డేలు ఆడిన టీమిండియా ఆటగాడిగా కోహ్లితో కలిసి ధావన్‌ సంయుక్తంగా ఉన్నాడు. ఇప్పటివరకు కోహ్లి, ధావన్‌లు విండీస్‌ గడ్డపై 15 మ్యాచ్‌లు ఆడారు.అటు కరేబియన్ గడ్డ పై
వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా టాప్‌-5 బ్యాట్స్‌మెన్లలో శిఖర్‌ ధావన్‌ యువరాజ్‌, రోహిత్ శర్మలను అధిగమించి మూడో స్థానానికి చేరుకున్నాడు.

ఇదే మ్యాచ్ లో ఓపెనర్ గిల్‌ 53 బంతుల్లో 6 ఫోర్లు,2 సిక్స్‌ల సాయంతో 64 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించిన గిల్‌ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్‌ గడ్డపై వన్డే ఫార్మాట్‌లో అర్ధ సెంచరీ సాధించిన రెండో భారత అతి పిన్న వయస్కుడుగా గిల్‌ రికార్డులకెక్కాడు.
తాజా మ్యాచ్‌లో సచిన్‌ రికార్డును గిల్‌ బ్రేక్‌ చేశాడు. సచిన్‌ ఈ ఫీట్‌ను 24 ఏళ్ల 3 రోజుల వయస్సులో నమోదు చేయగా.. గిల్‌ 22 ఏళ్ల 317 రోజుల వయస్సులో సాధించాడు.

శ్రేయాస్ అయ్యర్ ఈ మ్యాచ్‌లో 54 పరుగులతో వన్డే కెరీర్‌లో 10వ అర్ధశతకాన్ని నమోదు చేశాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్ ధావన్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో వేగంగా 1000 పరుగులను పూర్తి చేసిన రెండో భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.వన్డేల్లో వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. వీరిద్దరూ 24 ఇన్నింగ్స్‌లో ఈ రికార్డు నెలకొల్పగా శ్రేయాస్ 25 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు.