Big Battle: సిరీస్ పట్టేస్తారా ?

భారత్, సౌతాఫ్రికా చివరి టీ ట్వంటీ ఇవాళ జరగనుంది.

  • Written By:
  • Publish Date - June 19, 2022 / 02:12 PM IST

భారత్, సౌతాఫ్రికా చివరి టీ ట్వంటీ ఇవాళ జరగనుంది. బెంగళూరు వేదికగా సిరీస్ ఫలితం డిసైడ్ కాబోతోంది. తొలి రెండు మ్యాచ్‌లలో ఓడినా…తర్వాత వరుసగా రెండు విజయాలతో సిరీస్ సమం చేసిన టీమిండియా ఇప్పుడు చివరి మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది.

గత రెండు మ్యాచ్ లలో భారత విజయాల్లో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పాండ్య, దినేష్ కార్తిక్ లపైనే అందరి దృష్టి ఉంది. మరోసారి తమ బ్యాటింగ్ మెరుపులతో వీరు భారీ స్కోర్లు అందిస్తే భారత్‌కు విజయం పెద్ద కష్టం కాకపోవచ్చు. అయితే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ ఫామ్‌ అందుకోవాల్సి ఉంది. మూడో టీ ట్వంటీలో అదరగొట్టిన వీరిద్దరూ తర్వాతి మ్యాచ్‌లో నిరాశపరిచారు. ఇక మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్ తో పాటు రిషబ్ పంత్ ఈ సిరీస్ లో ఒక్క మ్యాచ్ లో కూడా భారీ స్కోర్లు సాధించలేదు. సిరీస్ ఫలితాన్ని తేల్చే మ్యాచ్‌లో వీరిద్దరూ రాణించాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది.
మరోవైపు బౌలింగ్‌లో భారత్ సమిష్టిగా రాణిస్తోంది.

సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ చాలారోజుల తర్వాత పూర్తి ఫామ్‌లోకి వచ్చాడు. వికెట్లు తీయడమే కాకుండా పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇక తొలి మూడు మ్యాచుల్లో విఫలమైన ఆవేష్ ఖాన్ నాలుగో టీ ట్వంటీలో అదరగొట్టాడు. నాలుగు వికెట్లతో సఫారీల పతనాన్ని శాసించాడు. మరోసారి తన పేస్ జోరును కొనసాగించాలని ఆవేష్ ఖాన్ భావిస్తున్నాడు. స్పిన్ విభాగంలో చాహల్, అక్షర్ పటేల్ కీలకం కానున్నారు.

ఇదిలా ఉంటే మరోవైపు గత రెండు మ్యాచ్‌లలో బ్యాటింగ్ వైఫల్యంతో ఓడిన సఫారీలు ఇవాల్టి మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. కీలక బ్యాటర్లు నిలకడగా రాణించకపోవడం ఆ జట్టుకు మైనస్‌పాయింట్. బ్యాటర్ల వైఫల్యంతోనే నాలుగో టీ ట్వంటీలో కేవలం 87 పరుగులకే ఆ జట్టు కుప్పకూలింది. దీంతో బ్యాటర్లు రాణిస్తే సిరీస్ సొంతం చేసుకోవచ్చని సౌతాఫ్రికా భావిస్తోంది. మిల్లర్, డస్సెన్‌తో పాటు డికాక్‌లపై అంచనాలున్నాయి. కాగా గత మ్యాచ్‌లో గాయంతో వెనుదిరిగిన కెప్టెన్ బవుమా కూడా చివరి మ్యాచ్‌లో ఆడడంపై సందిగ్ధత నెలకొంది.

ఒకవేళ బవుమా దూరమైతే అతని స్థానంలో హెండ్రిక్స్‌కు చోటు దక్కే అవకాశముంది. ఇక మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న బెంగళూరు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించనుంది. స్పిన్పర్ల అంతగా పిచ్ అనుకూలించకపోవడం, బౌండరీ లైన్ దగ్గరగా ఉండటంతో పరుగుల వరద పారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలిచే అవకాశం కూడా కనిపిస్తోంది.