ICC మహిళల T20 ప్రపంచ కప్ 2023 వచ్చే (Women’s T20 World Cup 2023) శుక్రవారం (ఫిబ్రవరి 10) కేప్ టౌన్‌లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు 10 జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇది ఎనిమిదో సీజన్. ఈ టోర్నీ తొలి సీజన్ 2009లో ఇంగ్లండ్‌లో జరిగింది. మొదటి మూడు టోర్నమెంట్లలో ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. కానీ 2014 సీజన్‌తో ఈ సంఖ్య 10కి పెరిగింది. 2024 టోర్నమెంట్‌కు బంగ్లాదేశ్, 2026 టోర్నమెంట్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇస్తుందని ICC జూలై 2022లో ప్రకటించింది. 2026 టోర్నీలో పాల్గొనే జట్ల సంఖ్య కూడా 12కి పెరుగుతుంది.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా జట్టు 5 సార్లు గెలుచుకుంది. అదే సమయంలో ఒకసారి ఇంగ్లండ్, మరోసారి వెస్టిండీస్ జట్టు ఈ ట్రోఫీని కైవసం చేసుకున్నాయి. చివరిసారి అంటే 2020లో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఇటీవల షెఫాలీ వర్మ సారథ్యంలో భారత జట్టు మహిళల అండర్-19 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో టీం ఇండియా ఉత్సాహంగా ఉంటూ 2023లో ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకునేందుకు సిద్ధమైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు దీప్తి శర్మ, రేణుకా సింగ్, రాధా యాదవ్, షెఫాలీ వర్మ, స్మృతి మంధాన వంటి వెటరన్ క్రికెటర్లతో తొలిసారి టైటిల్ గెలవాలని ప్రయత్నిస్తోంది.
Also Read: Rohit- Virat: కోహ్లీకి ఛాన్స్ ఉంది.. రోహిత్ కష్టమే: వసీం జాఫర్
ఐసిసి మహిళల టి 20 ప్రపంచ కప్ ఫిబ్రవరి 10 నుండి దక్షిణాఫ్రికా, శ్రీలంక మధ్య మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. అయితే భారత మహిళల క్రికెట్ ఫిబ్రవరి 12 నుండి తన మొదటి మ్యాచ్ ని ఆడనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 15న వెస్టిండీస్ తో, ఫిబ్రవరి 18న ఇంగ్లండ్ తో, ఫిబ్రవరి 20న ఐర్లాండ్ తో భారత మహిళల జట్టు తలపడనుంది. దక్షిణాఫ్రికా గడ్డపై ఈ నెల 10 నుంచి ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ టోర్నీలో 10 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో మ్యాచ్ లు ఆడతాయి. భారత్, పాకిస్థాన్ జట్లతో పాటు గ్రూప్-బీలో ఇంగ్లండ్, వెస్టిండీస్, ఐర్లాండ్ మహిళల జట్లు కూడా ఉన్నాయి.
టీమిండియా మహిళల జట్టు: హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), షెఫాలీ వర్మ, స్మృతి మందాన, రిచా గోష్, జెమీమా రోడ్రిగ్స్, యస్తికా భాటియా, హర్లీన్ డియోల్, రాధా యాదవ్, అంజలి శర్వాణి, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్, శిఖా పాండే, దేవికా వైద్య, రేణుకా ఠాకూర్.