IND Vs NZ: సెంచరీలతో కదంతొక్కిన రోహిత్, గిల్.. భారత్ భారీ స్కోరు

  • Written By:
  • Publish Date - January 24, 2023 / 05:24 PM IST

క్లీన్ స్వీప్ టార్గెట్ గా మూడో వన్డేలో బరిలోకి దిగిన టీమిండియా బ్యాటింగ్ లో అదరగొట్టింది. ఓపెనర్లు సూపర్ ఫామ్ తో రెచ్చిపోవడంతో భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ కు రోహిత్ శర్మ, శుబ్ మన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. కివీస్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ చెలరేగిపోయారు. తొలి వికెట్ కు వీరిద్దరూ 26.1 ఓవర్లలోనే 212 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరూ శతకాలు పూర్తి చేసుకున్నారు. గిల్ కు ఇది గత నాలుగు ఇన్నింగ్స్ ల్లో మూడో సెంచరీ. కొత్త ఏడాదిలో ఈ యువ ఓపెనర్ మంచి ఫాంలో ఉన్నాడు. మరోవైపు చాలా రోజుల తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ శతకం సాధించాడు. రోహిత్ కు ఇది వన్డేల్లో 30వ సెంచరీ. తద్వారా అత్యధిక శతకాల జాబితాలో సచిన్ , కోహ్లీల తర్వాత నిలిచాడు. అలాగే హిట్ మ్యాన్ కెరీర్.లో ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. రోహిత్ 85 బంతుల్లో 9 ఫోర్లు , 6 సిక్సర్లతో 101 రన్స్ చేసి ఔటయ్యాడు. అటు మరోసారి కివీస్ బౌలింగ్ పై విరుచుకుపడిన గిల్ 78 బంతుల్లో 13 ఫోర్లు , 5 సిక్సర్లతో 112 పరుగులు చేశాడు.

ఓపెనర్లు ఔటైన తర్వాత భారత్ వేగంగా ఆడే క్రమంలో వికెట్లు కోల్పోయింది. కోహ్లీ 36, ఇషాన్ కిషన్ 17 , సూర్యకుమార్ యాదవ్ 14 రన్స్ కే ఔటయ్యారు. ఈ దశలో హార్దిక పాండ్య మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 36 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. వాషింగ్టన్ సుందర్ కూడా 25 రన్స్ తో రాణించారు. దీంతో టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 385 పరుగులు చేసింది.