బంగ్లాదేశ్ (India vs Bangladesh)తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ స్కోర్ చేసింది. టాపార్డర్ లో రాహుల్, కోహ్లీ, గిల్ నిరాశపరిచినా.. తర్వాత పుజారా, పంత్, శ్రేయాస్ అయ్యర్ రాణించడంతో తొలిరోజు భారత్ (India vs Bangladesh) 6 వికెట్లకు 278 పరుగులు చేసింది. రెండోరోజు ఆరంభంలోనే శ్రేయాస్ అయ్యర్ ఔటవడంతో భారత్ ఇన్నింగ్స్ త్వరగా ముగుస్తుందనిపించింది. అయ్యర్ 86 రన్స్ కు వెనుదిరిగాడు. ఈ దశలో రవిచంద్రన్ అశ్విన్, కుల్ దీప్ యాదవ్ భారత్ ఇన్నింగ్స్ ను నిలబెట్టారు.
వీరిద్దరూ బంగ్లా బౌలింగ్ ను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు చేశారు. గత కొంత కాలంగా టెస్టుల్లో మంచి ఇన్నింగ్స్ లు ఆడుతున్న అశ్విన్ మరోసారి లోయర్ ఆర్డర్ లో తాను ఎంత కీలకమో నిరూపించుకున్నాడు. కుల్ దీప్ యాదవ్ తో కలిసి 8వ వికెట్ కు 92 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో అశ్విన్ హాఫ్ సెంచరీ సాధించాడు. అశ్విన్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 రన్స్ కు ఔటవగా.. కుల్ దీప్ యాదవ్ 40 పరుగులు చేశాడు. చివర్లో ఉమేశ్ యాదవ్ వేగంగా ఆడడంతో భారత్ 404 పరుగులకు ఆలౌటైంది. భారత్ ఇన్నింగ్స్ లో పుజారా 90 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 4, మెహదీ హసన్ మిరాజ్ 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ 5 రన్స్ కే 2 వికెట్లు కోల్పోయింది.
Also Read: New Zealand: కెప్టెన్సీ నుంచి తప్పుకున్న స్టార్ క్రికెటర్