Rohit Sharma: సాగర తీరాన వన్డే సమరం

భారత్, ఆస్ట్రేలియా వన్డే వినోదం ఇప్పుడు విశాఖకు షిప్ట్ అయింది. ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో గెలిచి ఆధిక్యం అందుకున్న టీమిండియా ఇప్పుడు సిరీస్..

  • Written By:
  • Publish Date - March 18, 2023 / 03:04 PM IST

భారత్, ఆస్ట్రేలియా వన్డే వినోదం ఇప్పుడు విశాఖకు షిప్ట్ అయింది. ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో గెలిచి ఆధిక్యం అందుకున్న టీమిండియా ఇప్పుడు సిరీస్ విజయంపై కన్నేసింది. కలిసొచ్చిన మైదానం, గత రికార్డులు ఇలా అన్ని భారత్ కు అనుకూలమే. మరోవైపు సిరీస్ చేజారకుండా ఉండాలంటే ఆసీస్ కు ఈ మ్యాచ్ డూ ఆర్ డై. కాగా తొలి మ్యాచ్ లో బౌలర్లు అదరగొట్టిన వేళ ఆసీస్ ను 200 లోపే పరిమితమైంది. అయితే స్వల్ప లక్ష్యఛేదనలో బ్యాటర్ల తడబాటు కనిపించినప్పటకీ.. కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా జట్టును గెలిపించారు. చాలా కాలంగా ఫామ్ లో లేక విమర్శలు ఎదుర్కొంటున్న కెఎల్ రాహుల్ క్లిష్టపరిస్థితుల్లో హాఫ్ సెంచరీతో జట్టుకు విజయాన్నందించాడు. బ్యాటింగ్ పరంగా టాపార్డర్ ఫామ్ పై పెద్దగా ఆందోళన లేకున్నా స్థాయికి తగ్గట్టు ఆడాల్సిన బాధ్యత ప్రధాన బ్యాటర్లపై ఉంటుంది. కాగా ఈ మ్యాచ్ కు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) జట్టులోకి రానుండగా.. ఇషాన్ కిషన్ పై వేటు పడనుంది.

వైజాగ్ వికెట్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో బౌలింగ్ కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. టీమిండియా నలుగురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతోనే బరిలోకి దిగనుంది. తొలి వన్డేలో సత్తా చాటిన మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ కొనసాగనుండగా.. బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా శార్దూల్ ఠాకూర్ తన స్థానాన్ని నిలబెట్టుకోనున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను ఆడిస్తారా లేక చాహల్‌ను తీసుకుంటారో చూడాలి. తొలి వన్డేలో కుల్దీప్ వికెట్ తీసినా ధారళంగా పరుగులిచ్చాడు. ఈ మ్యాచ్‌లోనూ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్ బెంచ్‌కే పరిమితం కానున్నారు.

మరోవైపు పేలవ బ్యాటింగ్‌తో ఓటమిపాలైన ఆస్ట్రేలియా విశాఖ వన్డేలో గెలిచి సిరీస్ సమం చేయాలని పట్టుదలగా ఉంది. గత మ్యాచ్ లో ఆ జట్టు బ్యాటర్లు చేతులెత్తేశారు. మిషెల్ మార్ష్ తప్పిస్తే మిగిలిన వారంతా విఫలమయ్యారు. దీంతో బ్యాటింగ్ పరంగా గాడిన పడితే తప్ప సిరీస్ ను సమం చేయడం ఆసీస్ కు కష్టమే. బౌలింగ్ పరంగా మాత్రం ఆసీస్ ఆకట్టుకుంది. తక్కువ స్కోరే అయినప్పటకీ.. కాపాడుకునేందుకు ఆ జట్టు బౌలర్లు పోరాడారు. ఇదే జోష్ లో విశాఖ వన్డే మీద ఫోకస్ చేసిన ఆసీస్ బ్యాటింగ్ పరంగా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. మరోవైపు విశాఖ టీమిండియాకు బాగా కలిసొచ్చిన వేదిక. ఇక్కడ 9 వన్డేలు జరగ్గా భారత్ ఏడింటిలో గెలిచింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో (Rohit Sharma) పాటు కోహ్లీ, కుల్ దీప్ యాదవ్ లకు కూడా ఇక్కడ మంచి రికార్డుంది. కాగా విశాఖ పిచ్ బ్యాటింగ్ కే కాకుండా స్పిన్నర్లకు కూడా అనుకూలిస్తుంది. మొత్తం మీద భారత్, ఆసీస్ క్రికెట్ హంగామాతో సాగరతీరం హోరెత్తిపోవడం ఖాయమని చెప్పొచ్చు.

Also Read:  Hardik Pandya: హార్థిక్ అప్పుడే అంత తలకెక్కిందా?